ఆకులో
ఆకునై.... పువ్వులో పువ్వునై... కొమ్మలో కొమ్మనై ....
ఈ పాట చాలా
బావుంటుంది కదా.... ఈ హెడ్డింగ్ ఎందుకు
పెట్టానంటే... నాకు మొక్కలన్నా,
పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పాటలోలాగ ఒకసారి వాటితో కలిసి, కబుర్లు చెప్పి ఆనందించి
రావాలనిపిస్తుంది. అందుకే ఈ పాటంటే కూడా నాకిష్టం. నాకు చిన్నప్పటి నుంచీ
పువ్వులతో, మొక్కలతో ఉన్న అనుబంధాల్ని అందరితో
పంచుకోవాలనిపించింది.
మేము
తాడేపల్లిగూడెంలో చిన్న వంతెన దగ్గర బ్రాహ్మణ వీధి అని వుండేది. అక్కడ కొచ్చెర్లకోట వాళ్ళింట్లో వుండేవాళ్ళం. మా నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో పనిచేసేవారు. నేను వరంగల్ లో పుట్టాను. మా చెల్లెలు ప్రభావతి బెంగుళూరులో పుట్టింది. తరవాత తాడేపల్లిగూడెం వచ్చాంట. నేను చిన్నప్పుడు మా అమ్మకి పూజకి పువ్వులు తీసుకుని
వచ్చేదాన్ని. ఎక్కడికెళ్ళి అనుకుంటారేమో. మా అమ్మ,
నేను
పొద్దున్నే 5.30కల్లా లేచేసేవాళ్ళం. మా అమ్మ కుంపటి అంటిచుకుని కాఫీ డికాక్షన్ వేసే లోపున నేను
ఒక పెద్ద ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని ఆ ఏరియాలో ఉన్న అందరిళ్ళకీ పువ్వుల కోసం
వెళ్ళేదాన్ని. తెలతెలవారుతూ వుండేది.
అక్కడక్కడ
ఇళ్ళల్లో వాళ్లు వాకిళ్ళు ఊడ్చుకుని,
కళ్ళాపి చల్లి
ముగ్గులు వేస్తుండేవాళ్ళు.
ఆ అందమైన
సమయాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. చెట్లు అప్పుడే బద్ధకంగా, నిద్రమత్తు వదిలించుకుని పువ్వులతో నాకోసం ఎదురు చూస్తున్నట్లుండేవి. చలికాలం పొద్దున్నే పొగమంచు
కప్పేసిన చెట్లు, చెట్ల మీదనుంచి చుక్కలు చుక్కలుగా మంచుపడుతూండేది. పక్షులు
కిలకిలలాడుతూ రెక్కలు విదుల్చుకుని వాటి కార్యక్రమాలలోకి అవి
వెళ్ళిపోతుండేవి. నేను పువ్వులకోసం వెడితే ఎవరూ కాదనేవారు కాదు. మందార పువ్వులు,
పచ్చ గన్నేరు
పువ్వులు ఒకటేమిటి ఇంచుమించు పది పదిహేను రకాల పువ్వులు తీసుకుని వెళ్ళేదాన్ని. నాకు అప్పుడు ఒక ఏడు సంవత్సరాలుంటాయేమో. ఇళ్లల్లో వాళ్ళు నిద్ర లేచేవాళ్ళుకాదు. ఒకవేళ చూసినా ఏమనేవారు కాదు.
అది చలికాలం.
డిసెంబరు జనవరి నెలలలో గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. వాటికి తప్పనిసరిగా బంతిపువ్వులు
పెట్టేవాళ్లం. హైదరాబాదులో బంతి పువ్వులు ఎప్పుడూ వస్తాయి కానీ, అక్కడ కేవలం
జనవరి, డిసెంబరు నెలలలో మాత్రమే వచ్చేవి. మా రోడ్డు చివర ఒక ఇల్లువుండేది. పెద్ద
కాంపౌండు. ఆ స్థలం నిండా పసుపు, ఎరుపు
ముద్దబంతిపువ్వులు, పెరుగుబంతి అని తెల్లగా వుండేవి. కృష్ణబంతి అని చిన్నగా ఎర్రగా
వుండేవి. ఒకటేమిటి చాలా రకాల బంతిపువ్వులు వుండేవి. నాకు పువ్వులంటే ఇష్టం కదా.
ఒకరోజు వాళ్లింటికి వెళ్ళాను. ఒక 16 ఏళ్ళ అమ్మాయి వుండేది. ఏంకావాలి ? అంది. బంతిపువ్వులు అన్నాను. నీకు పాటలొచ్చా అంది. ఆ వచ్చు అన్నాను.
అయితే నువ్వొక పాటపాడితే పువ్వులిస్తాను అంది. మా అమ్మ నేర్పిన గొబ్బిళ్ళ పాట
పాడాను. చాలా బంతిపువ్వులిచ్చింది. సంతోషంగా ఇంటికి వచ్చాను. అమ్మకి చెప్తే అమ్మ
నవ్వింది.
నా
చిన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను (తాతగారి వూరు) పెనుగొండ తీసుకువెళ్ళింది. వాళ్ళకి
పొలం వుండేది. మా తాతగారు నన్ను సైకిలు మీద పొలానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక
చెట్టు నిండా గులాబీ ముద్దమందారాలు విరగపూసి ఉన్నాయి. నాకు ఆ పువ్వులు కావాలని
అడిగాను. వెంటనే ఆ పువ్వులన్నీ కోసి నా ఒడినిండా పోశారు. అప్పట్లో కవర్లు వుండేవి
కాదుగా. పువ్వులు కోసిచ్చారనే ఆనందంలో ఉన్నాను. ఇంతలో కొబ్బరి బొండం కొట్టించి
నీళ్లు నాచేత తాగించి, లేత మీగడలాంటి కొబ్బరి గీకి పెట్టారు. ఆ రుచి ఇంకా
గుర్తుంది.
మా ఇంటి
దగ్గర ఒక తెల్లడాబా ఇల్లు వుండేది. దానికి చుట్టూ పొట్టి గోడలు, పట్టెమంచానికి
వున్న డిజైన్ లాంటి (అంటే ఇప్పటి భాషలో గ్రిల్స్ అంటారు) డిజైన్ సిమెంటుతో వుండేది. అంటే గోడ ఎక్కడానికి
వస్తుంది. గ్రీన్ కలర్ గేటు వుండేది. ఆ ఇంట్లో ఒక ముసలాయన చనిపోతే వాళ్లు ఆరు
నెలలు ఇంటిని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పట్లో అది ఆచారం. ఇల్లు ఖాళీగా
వుంచాలని. ఆ ఇంట్లో మందార చెట్లు, తెల్లపువ్వుల చెట్లు, కనకాంబరం చెట్లు వుండేవి.
నేను గేటు దూకి లోపలికి వెళ్లి మందార మొగ్గలన్నీ కోసుకు వచ్చేదాన్ని. ఏయ్ పాపా
అందులో దెయ్యం వుంది వెళ్ళకు అన్నారు. కానీ నేను ఆగితేగా ఆ పువ్వుల వ్యవహారం
కొనసాగుతూనే వుండేది. పైగా మా అమ్మకి, బామ్మకి చెప్పాను దెయ్యం లేదు ఏం లేదు అని.
మా బామ్మ
నన్ను కరివేపాకు, కంద వుడికేటప్పుడు వెయ్యడానికి జామ ఆకులు, చేమ ఆకులు, తోటకూర,
గోంగూర తెమ్మనేది. ఎవరింట్లో ఏ ఆకులుంటాయో ఏ పువ్వులుంటాయో బాగా తెలుసు కదా. తను
ఏది తెమ్మంటే అది టక్కున తెచ్చేసేదాన్ని. నాకు సప్లయిదారు అని పేరు పెట్టింది.
మా పెద్దక్క
అన్నపూర్ణ సైన్సు స్టూడెంట్. తనకి హెర్బేరియం కోసం ఆకులు, పువ్వులు నేనే తెచ్చి
ఇచ్చేదాన్ని. మా ఇంటికి దగ్గరలో ఒక చెరువు తవ్వి, ఆ చెరువు మధ్యలో కృష్ణుడు
బొమ్మని పెట్టారు. దానిని మేము కృష్ణుడు చెరువు అనేవాళ్లం. దాని చుట్టూ గట్లు
కట్టారు. చుట్టూరా పెద్ద పెద్ద చెట్లుండేవి. అసలు ఇళ్ళే వుండేవి కాదు. నేను మా
ఫ్రెండ్ ఘంటసాల లక్ష్మి సాయంత్రం ఆ చెరువు చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుకునేవాళ్ళం.
పచ్చని చెట్ల గాలి ఎంతో ఆహ్లాదంగా వుండేది. ఆ టైములో నేను ఒక చోట ఏవో వింత ఆకులు
చూశాను. సాయంత్రం అయిపోయిందికదా రేపు మధ్యాహ్నం వచ్చి అక్క (science student) కోసం ఈ ఆకులు తెద్దాం అనుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం
12.30కి వెళ్ళాను. ఎవరూ లేరు. మెల్లిగా వెళ్ళి ఆకులు కోశాను. ఉన్నట్టుండి. జుయ్
మని శబ్దం వచ్చింది. గుండెలు దడదడలాడాయి. ఇంక ఒకటే పరుగు. అస్సలు వెనక్కి కూడా
చూడలేదు. ఎవరో చెప్పారు. మధ్యాహ్నం దెయ్యాలు తిరుగుతాయి అని. అదేం కాదు కానీ. ఖాళీ
ప్రదేశం కదా చెట్టు వూగి అలా చప్పుడయినట్టుంది.
ఇంకోసారేమయిందంటే.....
మా పెద్దక్కకి రాజేశ్వరి, కామేశ్వరి, వరలక్ష్మి అని ముగ్గురు ఫ్రెండ్స్ వుండేవారు.
వాళ్ళు హెర్బేరియం కలక్షన్ కి రాజేశ్వరీ వాళ్ళ పొలానికి వెడుతున్నాం నన్నూ
రమ్మన్నారు. నేను ఎక్కడెక్కడవో వెతికి ఆకులు, పువ్వులు కోసిస్తానని అక్కకి తెలుసు.
సరే వాళ్ళతో బయల్దేరి వెళ్ళాను. రాజేశ్వరి ఉడకపెట్టిన కందికాయలు తెచ్చింది. అందరం
తింటూ మెల్లగా నడుచుకుంటూ ఆకులు, పువ్వులు కోసుకుంటూ వెడుతున్నాం. కందికాయలన్నీ
అయిపోయాయి. కానీ.... మాకు మాత్రం విపరీతమైన దాహం వేసింది. అందులో నేను చాలా చిన్న
పిల్లని దాహానికి అసలు తట్టుకోలేక పోయాను. వాళ్లూ కొంచెం కంగారు పడ్డారు. పొలం
రాజేశ్వరీ వాళ్ళదే కానీ, తనకి నీళ్ళు ఎక్కడుంటాయో తెలియదు. అప్పట్లో బాటిల్స్ తో
నీళ్ళు పట్టికెళ్ళడం తెలియదు. అమ్మావాళ్ళు ఊరెళితే శుభోదయం సినిమాలో లాగా
మరచెంబుతో నీళ్లు పట్టికెళ్లేవాళ్లు. సరే ఇక్కడ ఇక్కడ అంటూ గట్లు, గుట్టలు, తుప్పలు,
చెట్లు దాటుకుంటూ, కిందా మీదా పడుతూ కొంత
దూరం వెళ్ళాక ఒక చెరువు వచ్చింది. ఎడారిలో నీటిచెలమ లాగా అనిపించింది. కానీ నీళ్లు
పాచిపట్టేసి ఆకుపచ్చ రంగులో వున్నాయి. ఇంక నేను ఏదైతే అదే అయిందిలే అని మెల్లిగా
దిగి చేత్తో నీళ్ళు అటూ ఇటూ తోసి గబగబా నాలుగు గుక్కల నీళ్లు తాగాను. నాకు
చిన్నప్పటి నుంచీ కొంచెం ఏది బాగుండక పోయినా తినేదాన్ని కాదు. ఏలా తాగానో మరి.
నన్ను చూసి నాకేం కాలేదు కదా. అందరూ తాగి దాహం తీర్చుకున్నారు. మొత్తానికి
కావలసినవన్నీ కోసుకునే ఇంటికి వచ్చాం.
మేము 1 నుంచి
చదివి స్కూలు మునిసిపల్ స్కూలు. దానిని మేదర స్కూలు అనేవారు. అప్పట్లో ఆ స్కూలులో
హెడ్మాస్టరు దగ్గర నుంచి టీచర్సు (అప్పట్లో మాస్టారు అనేవారు) చాలావరకు మేదర
వాళ్ళే వుండేవారు. వాళ్లు అప్పుడు ఏ క్వాలిఫికేషన్ తో చేరేవారో తెలియదు. ఆ
స్కూలులో వెనకవైపు గొబ్బీ పువ్వులని పసుపు రంగులో డిసెంబరు పువ్వులలాగే వుండేవి.
నా పైన అక్కలు రమ, ఉమ, నేను మా ఇంటి పక్కన అబ్బాయిలు ఏ సెలవులో గుర్తులేదు కానీ,
సెలవులలో మాత్రం గోడదూకి ఆ పువ్వుల మొగ్గలు కోసుకుని వచ్చేవాళ్ళం. ఆ మొగ్గలు
చూడడానికి పసుపురంగులో కారప్పూసలా వుండేవి. వాటిని కారప్పూస అని అందరికీ
చెప్పేవాళ్ళం.
మా పెద్దక్క
కాలేజీ, మిగిలిన ఇద్దరు అక్కలూ హైస్కూలు చదువుకి వచ్చారు. వాళ్ళు ఆ స్కూలికి
వెళ్ళాలంటే కాలవ మీదున్న చిన్న వంతెన దాటి, రైల్వే ట్రాక్ దాటి అంటే స్టేషన్
లోనుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి గూడ్సు ట్రైన్ లు ఆగి వుంటే వాటి కిందనుంచి
కూడా దూరి వెళ్ళాల్సి వచ్చేది. మా నాన్నగారు ఆంధ్రా బ్యాంకులో చేసేవారు. అది కూడా
స్టేషనుకి అవతలే వుండేది. అందుకని ఇల్లు అన్నిటికీ దగ్గరగా స్టేషనుకి అటువైపు
మారాము.
మేము మారిన
ఇల్లు ఒక మేడ. పైన పెద్ద వరండా, పెద్ద హాలు రెండు రూములుగా పార్టిషన్ వుండేది. ఒక
వంటిల్లు. చాలా పెద్ద ఇల్లుగానే వుండేది. హాలుకి పెద్ద పెద్ద కిటికీలు చాలా
వుండేవి. వరండా గోడకి సిమెంటు గ్రిల్స్ వుండేవి. అంటే అక్కడ నుంచి చూస్తే మా ఇంటి
ముందునుంచి వెడుతున్న ప్రతి ట్రైను క్లియర్ గా కనిపించేది. వచ్చే పోయే ట్రైన్ లు చూస్తూ
అందరికీ టాటా చెప్పేవాళ్ళం. ప్రతి శుక్రవారం
స్పెషల్ ట్రెయిన్ వచ్చేది. అది చాలా అందంగా వుండేది. ఆ టైముకి అన్నం తింటున్నా సరే
స్పెషల్...... అంటూ పరిగెత్తేవాళ్లం. సరే
మా అక్క కోసం మానాన్నగారు మేడ మెట్లకి దగ్గరగా ఒక రూము తీసుకున్నారు. అయితే ఆ రూము
దాటాక చాలా ఖాళీ స్థలం వుండేది. ఇక నాకు, మా అమ్మకి పండగ. ఎక్కడెక్కడి నుంచో
రకరకాల మొక్కలు తెచ్చి నింపేసి తోట చేసేసాం.
అసలు సంగతి
ఇప్పుడు చెప్తున్నా. అక్కడ ఒక బావి
వుండేది. బావిపక్కన ఎర్రమందార చెట్టు పెట్టాము. అది చాలా పెద్దదైంది. రోజుకి 80
పువ్వులు పూసేది. చలికాలంలో మా మేడమీది కిటికీ నుంచి రాజకుమార్తె గవాక్షంలో నుంచి
చూసినట్లు పొద్దున్నే లేచి ముందు మొక్కలని చూసేదాన్ని. అబ్బ ఆ అందం చెప్పక్కరలేదు.
ఎందుకంటే గులాబీ రంగు డిసెంబరు పువ్వులు సగం సగం విచ్చుకుని చెట్టునిండా వుండేవి.
వాటిమీద పడిన మంచు తెల్లతెల్లగా మెరుస్తూ చాలా అందంగా వుండేది. ఆకుల మీంచి మంచు
కారుతూ ఆ బరువుకి ఆకులు వంగి వుండేవి. ఇంక మందార చెట్టయితే ఆకుపచ్చని ఆకుల మధ్య
అరవిచ్చిన ఎర్రటి పువ్వులు చెట్టుకి గంటలు తగిలించినట్లుండేవి. నాకు ఆ దృశ్యం ఇంకా
కళ్లకి కట్టినట్లుంటుంది. పచ్చగడ్డి మీద మంచుబిందువులు ముత్యాలు పరిచినట్లుండేవి.
మెల్లగా కాలకృత్యాలు తీర్చుకుని ఒక్కసారి మొక్కల మధ్య తిరిగి ఆ పువ్వులన్నీ
కోసుకుని వచ్చేదాన్ని.
ఇవి కాకుండా
ఎద్దనపూడి వాళ్ళు ఒక తెల్ల బిల్డింగ్ టెలిఫోన్ ఆఫీస్ కి అద్దెకి ఇచ్చారు. చాలా
రోజుల తరవాత వాళ్లు దాన్ని ఖాళీ చేసేసారు. దానికి గేటు చాలా పెద్దదిగా వుండేది.
గేటుకి అటూ ఇటూ ఏత్తైన స్తంభాలతో కూడిన గోడలు వుండేవి. ఆ స్తంభాల మీదికి చాలా
పెద్ద విరజాజి మొక్క పాకి వుండేది. మా అక్క ఉమ, నేను ఆ గోడ ఎక్కి జాజిపువ్వులన్నీ
కోసుకునేవాళ్ళం.
తాడేపల్లిగూడెం
దగ్గర పెంటపాడు అని వుండేది. అక్కడ నేను ఇంటర్మీడియేట్ (co-education college) లో చదివాను. మా వూరి
నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరం వుంటుంది. మా వూరు బోర్డర్స్ దాటగానే పచ్చటి
పొలాలు, చుట్టూరా పచ్చటి చెట్లు చాలా హాయిగా వుండేది. ఆ పొలాల్లో వరిపంటలు
వేసేవారు. ఆ పచ్చటి వరి పైరు గాలికి కెరటాల్లాగా కదులుతూ ‘గలగలపారుతున్న గోదారిలా’ వుండేది. ఆ అందం చూడాల్సిందే. మేము
కాలేజీకి రిక్షాలోనో, బస్ లోనో వెళ్ళేవాళ్ళం. ఒకోసారి క్లాసులు లేకపోతే తీరుబడిగా
నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా వచ్చేటప్పుడు ఒకళ్ళింట్లో కనకాంబరం తోటలు వుండేవి.
వాళ్ళు 25 పైసలకి 100 పువ్వులు అమ్మేవాళ్ళు. వాళ్ళింటికి వెళ్ళి పువ్వులన్నీ కోసి
ఒక్కోపువ్వు లెక్కపెట్టి ఎన్నిపువ్వులుంటే అన్ని కోసి తెచ్చుకునేవాళ్లం. అదో ఆనందం. అంతే కాకుండా దారిలో జామకాయలు ఇంకేవైనా చీప్ గా
దొరికితే అవన్నీ తెచ్చుకునేవాళ్ళం.
పెంటపాడులో మా కాలేజీ చాలా పెద్దది. దాని
వెనకంతా పొలాలే వుండేవి. అంతే కాకుండా మామిడి తోట, మధ్యలో చెరువు, చెరువులో నీలం,
ఎరుపు కలవపువ్వులు వుండేవి. దారిలో అంతా పసుపురంగు డిసెంబరుపువ్వులలా వుండే గొబ్బీ
పువ్వులు అనే వాళ్ళం అవి వుండేవి. అక్కడే అరటి నారో ఏదో తీసుకుని ఆ పువ్వులన్నీ
కట్టి పెట్టుకుని కాసేపు చెరువు గట్టున కూర్చుని, పంట పొలాల్లో ఆరతాయని పీకి
పెట్టిన పచ్చి వేరుశనగలు దొంగతనంగా పుస్తకాల మధ్యన పెట్టుకుని తినుకుంటూ వచ్చేవాళ్ళం.
నేను డిగ్రీ
అయిపోయాక ఒక రెండు సంవత్సరాలు స్కూలులో చేరాను. 1 నుండి 5 వరకు వుండేది. నేను 5వ
తరగతికి వెళ్ళేదాన్ని. పిల్లలకి పాఠాలు చాలా శ్రద్ధగా కథలలాగా చెప్పేదాన్ని.
అందుకని వాళ్ళకి నా క్లాస్ అంటే చాలా ఇష్టంగా వుండేది. అలాగే నేనంటే కూడా చాలా
ఇష్టంగా వుండేది. మాది మరీ చిన్న వూరూ కాదు. మరీ పెద్ద వూరూ కాదు. అందరిళ్ళల్లో రకరకాల మొక్కలుండేవి. నేను
స్కూలుకి వెళ్ళేసరికి నా టేబుల్ నిండా రకరకాల పువ్వుల దండలుండేవి. కనకాంబరం, జాజి,
మల్లె, సంపెంగ, డిసెంబరు, గులాబి ఏ సీజన్ లో ఆ పువ్వులనమాట. అన్నిపువ్వులూ
పెట్టుకుంటే కాని పిల్లలు వూరుకునేవారు కాదు. ఒకరోజు నేను స్నఫ్ కలర్ చీరమీద
రంగురంగుల చుక్కలున్న చీర కట్టుకుని వెళ్ళాను. అసలు చీరలు కట్టుకోవడమే తక్కువ. ఆ
చీర కట్టుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని క్లాసులో కూర్చున్నాను. శ్రీనివాస్ అని 1వ తరగతి చదువుతుండేవాడు. నల్లగా వుండేవాడు కానీ చాలా ముద్దుగా వుండేవాడు.
వాడు నా దగ్గిరకి పరుగెత్తుకుని వచ్చాడు. (అప్పట్లో ఆడవాళ్లని కూడా మేష్టారు అనేవారు.) ‘మేత్తాలండీ, మేత్తాలండీ మీలు ఈ
చీలకట్టుకుని, పువ్వులు పెట్టుకుని చాలా బాగున్నాలు’ అన్నాడు. అంత చిన్న పిల్లాడు అలా అనేసరికి ఒక్కసారి
ఆశ్చర్యపోయాను. నవ్వుకూడా వచ్చింది. వాణ్ణి ముద్దుపెట్టుకుని పంపించేశాను. కానీ
ఒకసారి వినాయక చవితికి వాళ్ళమ్మావాళ్ళు కాలవ గట్టునున్న గుళ్ళో పూజ
చేయించుకుంటున్నారు. వాడు చిన్నవాడు కదా తెలియక కాలవ దగ్గిరకి వెళ్ళి అందులో పడి
చనిపోయాడు. చాలా బాధేసింది.
మా అక్క ఉమా
వాళ్ళు ఢిల్లీలో వుంటారు. 1981లో మా అమ్మ, మిగిలిన ఆరుగురు అక్కచెల్లెళ్ళం ఢిల్లీ
వెళ్ళాం. మా బావగారు సైట్ సీయింగ్ కి బస్ బుక్ చేశారు. పొద్దున్న బయల్దేరిన
వాళ్ళం. రెడ్ ఫోర్ట్, హుమాయూన్ టూంబ్,
తీన్ మూర్తీ భవన్, తాజ్ మహల్ ఇంకా చాలా చూశాం. అయితే రెడ్ ఫోర్ట్ అంతా తిరిగి
చూస్తున్నాం. చాలా బాగుంది. బయటంతా తెల్లగులాబీలు ఫెన్సింగ్ లాగా వేశారు. నాకు
పువ్వుల పిచ్చి కదా. మెల్లిగా నాలుగు గులాబీ పువ్వులు కోసి పిన్నుతో తల్లో
పెట్టుకున్నాను. మా ఢిల్లీ అక్క ఉమ ‘పువ్వులు తీస్తావా? తియ్యవా?
అందరూ నవ్వుతున్నారు తియ్యి’
అని ఒకటే గోల పెట్టింది. ‘నవ్వితే నవ్వారు నాకు పువ్వులు ఇష్టం. నేను తియ్యను’ అన్నాను. సరే మొత్తానికి బస్ ఎక్కి అన్నీ తిరిగి ఇంటికి
వచ్చేశాం. అదయిన ఇన్ని సంవత్సరాల తర్వాత తను 2014లో మా ఇంటికి వచ్చింది. అప్పుడు
తను పువ్వులు ఎందుకు తియ్యమందో చెప్పింది. అక్కడ బోగం వాళ్ళు తప్ప పువ్వులు
పెట్టుకోరుట. అప్పుడే ఎందుకు చెప్పలేదని దెబ్బలాడాను.
నేను, నా తరవాత చెల్లెలు ప్రభావతి హైదరాబాదులో జాబ్ చేస్తున్నాం. అక్కడ
మా రెండో అక్కావాళ్ళింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉన్నాము. వాళ్ళింట్లో చాలా పెద్ద
సన్నజాజి తీగ గోడమీద నుంచి ఒక రేకుల షెడ్ మీదకి పాకి వుండేది. అది ఎప్పుడూ
విరగపూసి వుండేది. ఆ పువ్వుల కోసం నేను, ప్రభావతి తలుపు మీద నుంచి గోడఎక్కి, గోడ
మీద నుంచి రేకుల షెడ్ ఎక్కి మొత్తం జాజి మొగ్గలన్నీ కోసుకునే వాళ్ళం. ఇంక ఎవరైనా
ఎదైనా అంటారని కూడా ఆలోచన వుండేది కాదు. కానీ అన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ‘ఓసినీ ఇల్లు బంగారంగానూ పువ్వులకోసం
వయసొచ్చిన ఆడపిల్లలు అంతపైకి ఎక్కుతారా?’ అని బుగ్గలు నొక్కుకున్నారు.
ఒకసారి నేను,
ప్రభావతి, మా బాబాయి కొడుకు రామకృష్ణ కోటీ
వెళ్ళి వస్తున్నాం. ఒక బండీనిండా అరవిచ్చిన జాజిపువ్వులు అమ్ముకుంటూ వెడుతున్నాడు.
నాకు అది చూడగానే ‘అబ్బా
ఆ పువ్వులన్నీ ఒక్కసారి మీద పోసేసుకుంటే బాగుండును’ అన్నాను. వెంటనే రామకృష్ణ ‘నాకైతే నువ్వు అలా పోసుకుంటూంటే....
వాడు లబలబ మొత్తుకుంటుంటే..... చూడాలని వుంది’ అన్నాడు. ముగ్గురం నవ్వుకున్నాం.