9, నవంబర్ 2015, సోమవారం


రాగరాగిణి
అలరాజు రాకనెరింగిన సుధాంశుని బోలు
నామె మోమున విసుగు వేటలు జనించె
ప్రియానురాగంబొంద, ప్రేయసి పెదవులు
ఊర్పు నిట్టూర్పులందవిలి రాగమయ్యె!
అభిసారికయై అటునిటు తిరుగాడు
నామె పదములరుణ చరణములయ్యె!
ప్రియ నిరీక్షణ నిఖిలంబు లౌటచే
నీరజాక్షులు నెఱ్ఱనయ్యె!
ప్రియ సేవకై యొనరించు ప్రసూన భారంబుచే
పలుచని కరములనురాగమయమయ్యె!

3, నవంబర్ 2015, మంగళవారం

ఆకులో ఆకునై.... పువ్వులో పువ్వునై... కొమ్మలో కొమ్మనై ....

ఈ పాట చాలా బావుంటుంది కదా.... ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే... నాకు మొక్కలన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పాటలోలాగ ఒకసారి వాటితో కలిసి, కబుర్లు చెప్పి ఆనందించి రావాలనిపిస్తుంది. అందుకే ఈ పాటంటే కూడా నాకిష్టం. నాకు చిన్నప్పటి నుంచీ పువ్వులతో, మొక్కలతో ఉన్న అనుబంధాల్ని అందరితో పంచుకోవాలనిపించింది.
మేము తాడేపల్లిగూడెంలో చిన్న వంతెన దగ్గర బ్రాహ్మణ వీధి అని వుండేది. అక్కడ కొచ్చెర్లకోట వాళ్ళింట్లో వుండేవాళ్ళం. మా నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో పనిచేసేవారు. నేను వరంగల్ లో పుట్టాను. మా చెల్లెలు ప్రభావతి బెంగుళూరులో పుట్టింది. తరవాత తాడేపల్లిగూడెం వచ్చాంట. నేను చిన్నప్పుడు మా అమ్మకి పూజకి పువ్వులు తీసుకుని వచ్చేదాన్ని. ఎక్కడికెళ్ళి అనుకుంటారేమో. మా అమ్మ, నేను పొద్దున్నే 5.30కల్లా లేచేసేవాళ్ళం. మా అమ్మ కుంపటి అంటిచుకుని కాఫీ డికాక్షన్ వేసే లోపున నేను ఒక పెద్ద ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని ఆ ఏరియాలో ఉన్న అందరిళ్ళకీ పువ్వుల కోసం వెళ్ళేదాన్నితెలతెలవారుతూ వుండేది.
అక్కడక్కడ ఇళ్ళల్లో వాళ్లు వాకిళ్ళు ఊడ్చుకుని, కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తుండేవాళ్ళు. ఆ అందమైన సమయాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. చెట్లు అప్పుడే బద్ధకంగా, నిద్రమత్తు వదిలించుకుని పువ్వులతో నాకోసం ఎదురు చూస్తున్నట్లుండేవిచలికాలం పొద్దున్నే పొగమంచు కప్పేసిన చెట్లు, చెట్ల మీదనుంచి చుక్కలు చుక్కలుగా మంచుపడుతూండేది.  పక్షులు  కిలకిలలాడుతూ రెక్కలు విదుల్చుకుని వాటి కార్యక్రమాలలోకి అవి వెళ్ళిపోతుండేవినేను పువ్వులకోసం వెడితే ఎవరూ కాదనేవారు కాదు. మందార పువ్వులు, పచ్చ గన్నేరు పువ్వులు ఒకటేమిటి ఇంచుమించు పది పదిహేను రకాల పువ్వులు తీసుకుని వెళ్ళేదాన్ని. నాకు అప్పుడు ఒక ఏడు సంవత్సరాలుంటాయేమో. ఇళ్లల్లో వాళ్ళు నిద్ర లేచేవాళ్ళుకాదు. ఒకవేళ చూసినా ఏమనేవారు కాదు.
అది చలికాలం. డిసెంబరు జనవరి నెలలలో గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. వాటికి తప్పనిసరిగా బంతిపువ్వులు పెట్టేవాళ్లం. హైదరాబాదులో బంతి పువ్వులు ఎప్పుడూ వస్తాయి కానీ, అక్కడ కేవలం జనవరి, డిసెంబరు నెలలలో మాత్రమే వచ్చేవి. మా రోడ్డు చివర ఒక ఇల్లువుండేది. పెద్ద కాంపౌండు.  ఆ స్థలం నిండా పసుపు, ఎరుపు ముద్దబంతిపువ్వులు, పెరుగుబంతి అని తెల్లగా వుండేవి. కృష్ణబంతి అని చిన్నగా ఎర్రగా వుండేవి. ఒకటేమిటి చాలా రకాల బంతిపువ్వులు వుండేవి. నాకు పువ్వులంటే ఇష్టం కదా. ఒకరోజు వాళ్లింటికి వెళ్ళాను. ఒక 16 ఏళ్ళ అమ్మాయి వుండేది. ఏంకావాలి అంది. బంతిపువ్వులు అన్నాను. నీకు పాటలొచ్చా అంది. ఆ వచ్చు అన్నాను. అయితే నువ్వొక పాటపాడితే పువ్వులిస్తాను అంది. మా అమ్మ నేర్పిన గొబ్బిళ్ళ పాట పాడాను. చాలా బంతిపువ్వులిచ్చింది. సంతోషంగా ఇంటికి వచ్చాను. అమ్మకి చెప్తే అమ్మ నవ్వింది.
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను (తాతగారి వూరు) పెనుగొండ తీసుకువెళ్ళింది. వాళ్ళకి పొలం వుండేది. మా తాతగారు నన్ను సైకిలు మీద పొలానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఒక చెట్టు నిండా గులాబీ ముద్దమందారాలు విరగపూసి ఉన్నాయి. నాకు ఆ పువ్వులు కావాలని అడిగాను. వెంటనే ఆ పువ్వులన్నీ కోసి నా ఒడినిండా పోశారు. అప్పట్లో కవర్లు వుండేవి కాదుగా. పువ్వులు కోసిచ్చారనే ఆనందంలో ఉన్నాను. ఇంతలో కొబ్బరి బొండం కొట్టించి నీళ్లు నాచేత తాగించి, లేత మీగడలాంటి కొబ్బరి గీకి పెట్టారు. ఆ రుచి ఇంకా గుర్తుంది.
మా ఇంటి దగ్గర ఒక తెల్లడాబా ఇల్లు వుండేది. దానికి చుట్టూ పొట్టి గోడలు, పట్టెమంచానికి వున్న డిజైన్ లాంటి (అంటే ఇప్పటి భాషలో గ్రిల్స్ అంటారు) డిజైన్  సిమెంటుతో వుండేది. అంటే గోడ ఎక్కడానికి వస్తుంది. గ్రీన్ కలర్ గేటు వుండేది. ఆ ఇంట్లో ఒక ముసలాయన చనిపోతే వాళ్లు ఆరు నెలలు ఇంటిని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పట్లో అది ఆచారం. ఇల్లు ఖాళీగా వుంచాలని. ఆ ఇంట్లో మందార చెట్లు, తెల్లపువ్వుల చెట్లు, కనకాంబరం చెట్లు వుండేవి. నేను గేటు దూకి లోపలికి వెళ్లి మందార మొగ్గలన్నీ కోసుకు వచ్చేదాన్ని. ఏయ్ పాపా అందులో దెయ్యం వుంది వెళ్ళకు అన్నారు. కానీ నేను ఆగితేగా ఆ పువ్వుల వ్యవహారం కొనసాగుతూనే వుండేది. పైగా మా అమ్మకి, బామ్మకి చెప్పాను దెయ్యం లేదు ఏం లేదు అని.
మా బామ్మ నన్ను కరివేపాకు, కంద వుడికేటప్పుడు వెయ్యడానికి జామ ఆకులు, చేమ ఆకులు, తోటకూర, గోంగూర తెమ్మనేది. ఎవరింట్లో ఏ ఆకులుంటాయో ఏ పువ్వులుంటాయో బాగా తెలుసు కదా. తను ఏది తెమ్మంటే అది టక్కున తెచ్చేసేదాన్ని. నాకు సప్లయిదారు అని పేరు పెట్టింది.
మా పెద్దక్క అన్నపూర్ణ సైన్సు స్టూడెంట్. తనకి హెర్బేరియం కోసం ఆకులు, పువ్వులు నేనే తెచ్చి ఇచ్చేదాన్ని. మా ఇంటికి దగ్గరలో ఒక చెరువు తవ్వి, ఆ చెరువు మధ్యలో కృష్ణుడు బొమ్మని పెట్టారు. దానిని మేము కృష్ణుడు చెరువు అనేవాళ్లం. దాని చుట్టూ గట్లు కట్టారు. చుట్టూరా పెద్ద పెద్ద చెట్లుండేవి. అసలు ఇళ్ళే వుండేవి కాదు. నేను మా ఫ్రెండ్ ఘంటసాల లక్ష్మి సాయంత్రం ఆ చెరువు చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుకునేవాళ్ళం. పచ్చని చెట్ల గాలి ఎంతో ఆహ్లాదంగా వుండేది. ఆ టైములో నేను ఒక చోట ఏవో వింత ఆకులు చూశాను. సాయంత్రం అయిపోయిందికదా రేపు మధ్యాహ్నం వచ్చి అక్క (science student)  కోసం ఈ ఆకులు తెద్దాం అనుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం 12.30కి వెళ్ళాను. ఎవరూ లేరు. మెల్లిగా వెళ్ళి ఆకులు కోశాను. ఉన్నట్టుండి. జుయ్ మని శబ్దం వచ్చింది. గుండెలు దడదడలాడాయి. ఇంక ఒకటే పరుగు. అస్సలు వెనక్కి కూడా చూడలేదు. ఎవరో చెప్పారు. మధ్యాహ్నం దెయ్యాలు తిరుగుతాయి అని. అదేం కాదు కానీ. ఖాళీ ప్రదేశం కదా చెట్టు వూగి అలా చప్పుడయినట్టుంది.
ఇంకోసారేమయిందంటే..... మా పెద్దక్కకి రాజేశ్వరి, కామేశ్వరి, వరలక్ష్మి అని ముగ్గురు ఫ్రెండ్స్ వుండేవారు. వాళ్ళు హెర్బేరియం కలక్షన్ కి రాజేశ్వరీ వాళ్ళ పొలానికి వెడుతున్నాం నన్నూ రమ్మన్నారు. నేను ఎక్కడెక్కడవో వెతికి ఆకులు, పువ్వులు కోసిస్తానని అక్కకి తెలుసు. సరే వాళ్ళతో బయల్దేరి వెళ్ళాను. రాజేశ్వరి ఉడకపెట్టిన కందికాయలు తెచ్చింది. అందరం తింటూ మెల్లగా నడుచుకుంటూ ఆకులు, పువ్వులు కోసుకుంటూ వెడుతున్నాం. కందికాయలన్నీ అయిపోయాయి. కానీ.... మాకు మాత్రం విపరీతమైన దాహం వేసింది. అందులో నేను చాలా చిన్న పిల్లని దాహానికి అసలు తట్టుకోలేక పోయాను. వాళ్లూ కొంచెం కంగారు పడ్డారు. పొలం రాజేశ్వరీ వాళ్ళదే కానీ, తనకి నీళ్ళు ఎక్కడుంటాయో తెలియదు. అప్పట్లో బాటిల్స్ తో నీళ్ళు పట్టికెళ్ళడం తెలియదు. అమ్మావాళ్ళు ఊరెళితే శుభోదయం సినిమాలో లాగా మరచెంబుతో నీళ్లు పట్టికెళ్లేవాళ్లు. సరే ఇక్కడ ఇక్కడ అంటూ గట్లు, గుట్టలు, తుప్పలు, చెట్లు దాటుకుంటూ, కిందా మీదా పడుతూ  కొంత దూరం వెళ్ళాక ఒక చెరువు వచ్చింది. ఎడారిలో నీటిచెలమ లాగా అనిపించింది. కానీ నీళ్లు పాచిపట్టేసి ఆకుపచ్చ రంగులో వున్నాయి. ఇంక నేను ఏదైతే అదే అయిందిలే అని మెల్లిగా దిగి చేత్తో నీళ్ళు అటూ ఇటూ తోసి గబగబా నాలుగు గుక్కల నీళ్లు తాగాను. నాకు చిన్నప్పటి నుంచీ కొంచెం ఏది బాగుండక పోయినా తినేదాన్ని కాదు. ఏలా తాగానో మరి. నన్ను చూసి నాకేం కాలేదు కదా. అందరూ తాగి దాహం తీర్చుకున్నారు. మొత్తానికి కావలసినవన్నీ కోసుకునే ఇంటికి వచ్చాం.
మేము 1 నుంచి చదివి స్కూలు మునిసిపల్ స్కూలు. దానిని మేదర స్కూలు అనేవారు. అప్పట్లో ఆ స్కూలులో హెడ్మాస్టరు దగ్గర నుంచి టీచర్సు (అప్పట్లో మాస్టారు అనేవారు) చాలావరకు మేదర వాళ్ళే వుండేవారు. వాళ్లు అప్పుడు ఏ క్వాలిఫికేషన్ తో చేరేవారో తెలియదు. ఆ స్కూలులో వెనకవైపు గొబ్బీ పువ్వులని పసుపు రంగులో డిసెంబరు పువ్వులలాగే వుండేవి. నా పైన అక్కలు రమ, ఉమ, నేను మా ఇంటి పక్కన అబ్బాయిలు ఏ సెలవులో గుర్తులేదు కానీ, సెలవులలో మాత్రం గోడదూకి ఆ పువ్వుల మొగ్గలు కోసుకుని వచ్చేవాళ్ళం. ఆ మొగ్గలు చూడడానికి పసుపురంగులో కారప్పూసలా వుండేవి. వాటిని కారప్పూస అని అందరికీ చెప్పేవాళ్ళం.
మా పెద్దక్క కాలేజీ, మిగిలిన ఇద్దరు అక్కలూ హైస్కూలు చదువుకి వచ్చారు. వాళ్ళు ఆ స్కూలికి వెళ్ళాలంటే కాలవ మీదున్న చిన్న వంతెన దాటి, రైల్వే ట్రాక్ దాటి అంటే స్టేషన్ లోనుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి గూడ్సు ట్రైన్ లు ఆగి వుంటే వాటి కిందనుంచి కూడా దూరి వెళ్ళాల్సి వచ్చేది. మా నాన్నగారు ఆంధ్రా బ్యాంకులో చేసేవారు. అది కూడా స్టేషనుకి అవతలే వుండేది. అందుకని ఇల్లు అన్నిటికీ దగ్గరగా స్టేషనుకి అటువైపు మారాము.
మేము మారిన ఇల్లు ఒక మేడ. పైన పెద్ద వరండా, పెద్ద హాలు రెండు రూములుగా పార్టిషన్ వుండేది. ఒక వంటిల్లు. చాలా పెద్ద ఇల్లుగానే వుండేది. హాలుకి పెద్ద పెద్ద కిటికీలు చాలా వుండేవి. వరండా గోడకి సిమెంటు గ్రిల్స్ వుండేవి. అంటే అక్కడ నుంచి చూస్తే మా ఇంటి ముందునుంచి వెడుతున్న ప్రతి ట్రైను క్లియర్ గా కనిపించేది. వచ్చే పోయే ట్రైన్ లు చూస్తూ అందరికీ టాటా చెప్పేవాళ్ళం.  ప్రతి శుక్రవారం స్పెషల్ ట్రెయిన్ వచ్చేది. అది చాలా అందంగా వుండేది. ఆ టైముకి అన్నం తింటున్నా సరే స్పెషల్...... అంటూ పరిగెత్తేవాళ్లం.  సరే మా అక్క కోసం మానాన్నగారు మేడ మెట్లకి దగ్గరగా ఒక రూము తీసుకున్నారు. అయితే ఆ రూము దాటాక చాలా ఖాళీ స్థలం వుండేది. ఇక నాకు, మా అమ్మకి పండగ. ఎక్కడెక్కడి నుంచో రకరకాల మొక్కలు తెచ్చి నింపేసి తోట చేసేసాం.
అసలు సంగతి ఇప్పుడు చెప్తున్నా.  అక్కడ ఒక బావి వుండేది. బావిపక్కన ఎర్రమందార చెట్టు పెట్టాము. అది చాలా పెద్దదైంది. రోజుకి 80 పువ్వులు పూసేది. చలికాలంలో మా మేడమీది కిటికీ నుంచి రాజకుమార్తె గవాక్షంలో నుంచి చూసినట్లు పొద్దున్నే లేచి ముందు మొక్కలని చూసేదాన్ని. అబ్బ ఆ అందం చెప్పక్కరలేదు. ఎందుకంటే గులాబీ రంగు డిసెంబరు పువ్వులు సగం సగం విచ్చుకుని చెట్టునిండా వుండేవి. వాటిమీద పడిన మంచు తెల్లతెల్లగా మెరుస్తూ చాలా అందంగా వుండేది. ఆకుల మీంచి మంచు కారుతూ ఆ బరువుకి ఆకులు వంగి వుండేవి. ఇంక మందార చెట్టయితే ఆకుపచ్చని ఆకుల మధ్య అరవిచ్చిన ఎర్రటి పువ్వులు చెట్టుకి గంటలు తగిలించినట్లుండేవి. నాకు ఆ దృశ్యం ఇంకా కళ్లకి కట్టినట్లుంటుంది. పచ్చగడ్డి మీద మంచుబిందువులు ముత్యాలు పరిచినట్లుండేవి. మెల్లగా కాలకృత్యాలు తీర్చుకుని ఒక్కసారి మొక్కల మధ్య తిరిగి ఆ పువ్వులన్నీ కోసుకుని వచ్చేదాన్ని.
ఇవి కాకుండా ఎద్దనపూడి వాళ్ళు ఒక తెల్ల బిల్డింగ్ టెలిఫోన్ ఆఫీస్ కి అద్దెకి ఇచ్చారు. చాలా రోజుల తరవాత వాళ్లు దాన్ని ఖాళీ చేసేసారు. దానికి గేటు చాలా పెద్దదిగా వుండేది. గేటుకి అటూ ఇటూ ఏత్తైన స్తంభాలతో కూడిన గోడలు వుండేవి. ఆ స్తంభాల మీదికి చాలా పెద్ద విరజాజి మొక్క పాకి వుండేది. మా అక్క ఉమ, నేను ఆ గోడ ఎక్కి జాజిపువ్వులన్నీ కోసుకునేవాళ్ళం.
తాడేపల్లిగూడెం దగ్గర పెంటపాడు అని వుండేది. అక్కడ నేను ఇంటర్మీడియేట్ (co-education college) లో చదివాను. మా వూరి నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరం వుంటుంది. మా వూరు బోర్డర్స్ దాటగానే పచ్చటి పొలాలు, చుట్టూరా పచ్చటి చెట్లు చాలా హాయిగా వుండేది. ఆ పొలాల్లో వరిపంటలు వేసేవారు. ఆ పచ్చటి వరి పైరు గాలికి కెరటాల్లాగా కదులుతూగలగలపారుతున్న గోదారిలా వుండేది. ఆ అందం చూడాల్సిందే. మేము కాలేజీకి రిక్షాలోనో, బస్ లోనో వెళ్ళేవాళ్ళం. ఒకోసారి క్లాసులు లేకపోతే తీరుబడిగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అలా వచ్చేటప్పుడు ఒకళ్ళింట్లో కనకాంబరం తోటలు వుండేవి. వాళ్ళు 25 పైసలకి 100 పువ్వులు అమ్మేవాళ్ళు. వాళ్ళింటికి వెళ్ళి పువ్వులన్నీ కోసి ఒక్కోపువ్వు లెక్కపెట్టి ఎన్నిపువ్వులుంటే అన్ని కోసి తెచ్చుకునేవాళ్లం. అదో ఆనందం.  అంతే కాకుండా దారిలో జామకాయలు ఇంకేవైనా చీప్ గా దొరికితే అవన్నీ తెచ్చుకునేవాళ్ళం.
 పెంటపాడులో మా కాలేజీ చాలా పెద్దది. దాని వెనకంతా పొలాలే వుండేవి. అంతే కాకుండా మామిడి తోట, మధ్యలో చెరువు, చెరువులో నీలం, ఎరుపు కలవపువ్వులు వుండేవి. దారిలో అంతా పసుపురంగు డిసెంబరుపువ్వులలా వుండే గొబ్బీ పువ్వులు అనే వాళ్ళం అవి వుండేవి. అక్కడే అరటి నారో ఏదో తీసుకుని ఆ పువ్వులన్నీ కట్టి పెట్టుకుని కాసేపు చెరువు గట్టున కూర్చుని, పంట పొలాల్లో ఆరతాయని పీకి పెట్టిన పచ్చి వేరుశనగలు దొంగతనంగా పుస్తకాల మధ్యన పెట్టుకుని తినుకుంటూ వచ్చేవాళ్ళం.
నేను డిగ్రీ అయిపోయాక ఒక రెండు సంవత్సరాలు స్కూలులో చేరాను. 1 నుండి 5 వరకు వుండేది. నేను 5వ తరగతికి వెళ్ళేదాన్ని. పిల్లలకి పాఠాలు చాలా శ్రద్ధగా కథలలాగా చెప్పేదాన్ని. అందుకని వాళ్ళకి నా క్లాస్ అంటే చాలా ఇష్టంగా వుండేది. అలాగే నేనంటే కూడా చాలా ఇష్టంగా వుండేది. మాది మరీ చిన్న వూరూ కాదు. మరీ పెద్ద వూరూ కాదు.  అందరిళ్ళల్లో రకరకాల మొక్కలుండేవి. నేను స్కూలుకి వెళ్ళేసరికి నా టేబుల్ నిండా రకరకాల పువ్వుల దండలుండేవి. కనకాంబరం, జాజి, మల్లె, సంపెంగ, డిసెంబరు, గులాబి ఏ సీజన్ లో ఆ పువ్వులనమాట. అన్నిపువ్వులూ పెట్టుకుంటే కాని పిల్లలు వూరుకునేవారు కాదు. ఒకరోజు నేను స్నఫ్ కలర్ చీరమీద రంగురంగుల చుక్కలున్న చీర కట్టుకుని వెళ్ళాను. అసలు చీరలు కట్టుకోవడమే తక్కువ. ఆ చీర కట్టుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని క్లాసులో కూర్చున్నాను. శ్రీనివాస్  అని 1వ తరగతి చదువుతుండేవాడు.  నల్లగా వుండేవాడు కానీ చాలా ముద్దుగా వుండేవాడు. వాడు నా దగ్గిరకి పరుగెత్తుకుని వచ్చాడు. (అప్పట్లో ఆడవాళ్లని  కూడా మేష్టారు అనేవారు.) మేత్తాలండీ, మేత్తాలండీ మీలు ఈ చీలకట్టుకుని, పువ్వులు పెట్టుకుని చాలా బాగున్నాలు అన్నాడు. అంత చిన్న పిల్లాడు అలా అనేసరికి ఒక్కసారి ఆశ్చర్యపోయాను. నవ్వుకూడా వచ్చింది. వాణ్ణి ముద్దుపెట్టుకుని పంపించేశాను. కానీ ఒకసారి వినాయక చవితికి వాళ్ళమ్మావాళ్ళు కాలవ గట్టునున్న గుళ్ళో పూజ చేయించుకుంటున్నారు. వాడు చిన్నవాడు కదా తెలియక కాలవ దగ్గిరకి వెళ్ళి అందులో పడి చనిపోయాడు. చాలా బాధేసింది.
మా అక్క ఉమా వాళ్ళు ఢిల్లీలో వుంటారు. 1981లో మా అమ్మ, మిగిలిన ఆరుగురు అక్కచెల్లెళ్ళం ఢిల్లీ వెళ్ళాం. మా బావగారు సైట్ సీయింగ్ కి బస్ బుక్ చేశారు. పొద్దున్న బయల్దేరిన వాళ్ళం. రెడ్ ఫోర్ట్,  హుమాయూన్ టూంబ్, తీన్ మూర్తీ భవన్, తాజ్ మహల్ ఇంకా చాలా చూశాం. అయితే రెడ్ ఫోర్ట్ అంతా తిరిగి చూస్తున్నాం. చాలా బాగుంది. బయటంతా తెల్లగులాబీలు ఫెన్సింగ్ లాగా వేశారు. నాకు పువ్వుల పిచ్చి కదా. మెల్లిగా నాలుగు గులాబీ పువ్వులు కోసి పిన్నుతో తల్లో పెట్టుకున్నాను. మా ఢిల్లీ అక్క ఉమ పువ్వులు తీస్తావా? తియ్యవా? అందరూ నవ్వుతున్నారు తియ్యి అని ఒకటే గోల పెట్టింది.  నవ్వితే నవ్వారు నాకు పువ్వులు ఇష్టం. నేను తియ్యను అన్నాను.  సరే మొత్తానికి బస్ ఎక్కి అన్నీ తిరిగి ఇంటికి వచ్చేశాం. అదయిన ఇన్ని సంవత్సరాల తర్వాత తను 2014లో మా ఇంటికి వచ్చింది. అప్పుడు తను పువ్వులు ఎందుకు తియ్యమందో చెప్పింది. అక్కడ బోగం వాళ్ళు తప్ప పువ్వులు పెట్టుకోరుట. అప్పుడే ఎందుకు చెప్పలేదని దెబ్బలాడాను.
నేను,  నా తరవాత చెల్లెలు  ప్రభావతి హైదరాబాదులో జాబ్ చేస్తున్నాం. అక్కడ మా రెండో అక్కావాళ్ళింటికి వెళ్ళి నాలుగు రోజులు ఉన్నాము. వాళ్ళింట్లో చాలా పెద్ద సన్నజాజి తీగ గోడమీద నుంచి ఒక రేకుల షెడ్ మీదకి పాకి వుండేది. అది ఎప్పుడూ విరగపూసి వుండేది. ఆ పువ్వుల కోసం నేను, ప్రభావతి తలుపు మీద నుంచి గోడఎక్కి, గోడ మీద నుంచి రేకుల షెడ్ ఎక్కి మొత్తం జాజి మొగ్గలన్నీ కోసుకునే వాళ్ళం. ఇంక ఎవరైనా ఎదైనా అంటారని కూడా ఆలోచన వుండేది కాదు. కానీ అన్నారు. ఆ చుట్టుపక్కల వాళ్లు ఓసినీ ఇల్లు బంగారంగానూ పువ్వులకోసం వయసొచ్చిన ఆడపిల్లలు అంతపైకి ఎక్కుతారా?’ అని బుగ్గలు నొక్కుకున్నారు.
ఒకసారి నేను,  ప్రభావతి, మా బాబాయి కొడుకు రామకృష్ణ కోటీ వెళ్ళి వస్తున్నాం. ఒక బండీనిండా అరవిచ్చిన జాజిపువ్వులు అమ్ముకుంటూ వెడుతున్నాడు. నాకు అది చూడగానే అబ్బా ఆ పువ్వులన్నీ ఒక్కసారి మీద పోసేసుకుంటే బాగుండును అన్నాను. వెంటనే రామకృష్ణ నాకైతే నువ్వు అలా పోసుకుంటూంటే.... వాడు లబలబ మొత్తుకుంటుంటే..... చూడాలని వుంది అన్నాడు. ముగ్గురం నవ్వుకున్నాం.




మధురగీతాలు - మధుర స్మృతులు
మనం ఎప్పుడూ ఏదో సమస్యల గురించి ఆలోచిస్తూ వుంటాం. కానీ మన జీవితంలోని మధుర స్మృతులలోకి వెడితే చాలా ఆనందించగలుగుతాం. ఈ మధుర గీతాల మధుర స్మృతులు ఏమిటంటే - నేనీ మధ్యన కంప్యూటర్ లో పాతపాటలు వింటూ వర్కు చేసుకుంటున్నానునా చిన్నప్పటి నుంచీ విన్న, నాకు నచ్చిన పాటలు అన్నీ నాకు యూట్యూబ్ లో దొరికాయి.
అయితే ఒక్కోపాట వింటూంటే నేను ఆనాటి సంఘటనల్లోకి వెళ్ళిపోయి ఎంతో ఆనందాన్ని పొందాను.
పాడవోయి భారతీయుడా.... ఆడిపాడవోయి విజయ గీతికా.... (1961) వెలుగు నీడలు
ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులు..... (1964) మూగమనసులు
ఎంతవారలైన వేదాంతులైన గాని ఓరచూపు.... భలే తమ్ముడు
ఈ పాటలు వింటూంటే......
మా చిన్నప్పుడు వేసవి సెలవులకి మా తాతగారి వూరు పెనుగొండ (తణుకు దగ్గర) వెళ్లేవాళ్ళంవాళ్ళకి పెద్ద పెంకుటిల్లు ఉండేది. వెనకవైపు మల్లె, గులాబి, నందివర్ధనం మొదలైన పువ్వుల చెట్లు, ఆవులు, గేదెలు వుండేవి. ముందు వైపు చాలా ఎత్తైన కాంపౌండ్ వాల్ వుండేదిఆ గోడ మీద గిన్నె మాలతీ తీగలు అందమైన తెల్లటి పువ్వులతో సువాసనలు విరజిమ్ముతూ వుండేవి ముందు గుమ్మానికి ఉన్న మెట్లమీద సాయంత్రం నేను, మా తరవాత చెల్లెలు ప్రభావతి కూర్చునే వాళ్ళం. అయితే మాతాతగారు టైం పాస్ కి సినిమా హాల్లో మేనేజరుగా పనిచేసేవారుపనిమనిషి సాయంత్రం నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేది. గోధూళి వేళ సాయంత్రం చల్లటి వాతావరణం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే  ఆ సినిమా హాల్లో మైక్ పెట్టి సినిమా మొదలయ్యే లోపున పాటలు వేసేవాళ్ళు. అవి దూరం నుంచీ చాలా ప్రశాంతంగా వినిపించేవి. ఈ పాత పాటలన్నీ వినేవాళ్ళం. అంత చిన్నప్పుడు కూడా అదెంతో హాయిగా ఆనందంగా అనిపించేదిఈ గతంలోకి వెళ్ళి ఆనందాన్ని పొందాను.
బలేతాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ (1955) దొంగరాముడు
నేను వినే పాటల్లో ఈ పాట గుర్తు చేసుకుని విన్నాను. మా చిన్నప్పుడు మేము తాడేపల్లిగూడెంలో ఒక ఇంట్లో వుండేవాళ్ళం. మూడు వాటాల పెంకుటిల్లు. మా ఇంటి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు. చిన్నబ్బాయి పేరు గోపి. కొంచెం అయోమయంగా వుండేవాడు. అప్పట్లో రేడియోలే కదా. వాళ్లింట్లో పెద్ద రేడియో వుండేదినేను వాళ్లింటికి వెడితే. స్టైల్ గా రేడియో దగ్గర నుంచుని ఇందులో నీకేం పాట కావాలో చెప్పు అన్నాడు. నేను బలే తాత మన బాపూజీ పాట పెట్టు అన్నానుతనకీ తెలియదు. ఎలా పెట్టాలో అవీ ఇవీ తిప్పేసి ఇప్పుడు వెయ్యరుట అన్నాడుతలుచుకుంటే నవ్వు వస్తుంది.
మేము కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మా నాన్నగారు రేడియోలో పాటలు కూడా విననిచ్చేవాళ్ళు కాదు. అసలు రేడియో ఎలా పెట్టాలో కూడా తెలియదు. తను ఒక్కరే వినేవారు. మా నాన్నగారు నేను 7వ తగతిలో వుండగా పోయారు. నేను 10వ తరగతిలోకి వచ్చాక అప్పుడు మా అక్కలు రేడియో కొని వివిధ భారతిలో పాటలు వింటూంటే నేనూ వినేదాన్నిఅది కాకుండా వూళ్ళల్లో ఏ ప్రోగ్రాములైనా మైకులు పెట్టేసి పాటలు వేసేవాళ్ళు.

హే నీలే గగన్ కి తలే ధర్తీ కా ప్యార్ ఫలే (1967) హమ్ రాజ్
ఈ పాట మా పెద్దక్క అన్నపూర్ణకి చాలా ఇష్టం. నా పైన ముగ్గురు అక్కలచేత  మా నాన్నగారు హిందీ పరీక్షలకి కట్టించారు. భాషాజ్ఞానం కోసం హిందీ సినిమాలకి తీసుకెళ్ళేవాళ్లు. పెద్దక్క ఈ పాట బాగా వింటూండేది, పాడుతూండేది. మా ఇంటి దగ్గర ఎద్దనపూడి వాళ్ల కుంటుంబం వుండేది. వాళ్లూ ఐదుగురు అమ్మాయిలు వాళ్లల్లో అన్నపూర్ణ మా రెండవ అక్క క్లాస్ మేట్, సరస్వతి నా క్లాస్ మేట్, పెద్దమ్మాయి భాగ్యలక్ష్మి పెద్దక్క అన్నపూర్ణకన్నా సీనియర్. అందుకని తరచు వాళ్ళు మేము కలుసుకుంటూ వుండేవాళ్ళం. వాళ్ళ నాన్నగారికి లలిత కళలంటే ఇష్టంగా వుండేది. లలితకళా సమితి అని పెట్టి,  మీటింగులు పెట్టేవాళ్ళు. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. ఎప్పటి నుంచో వున్న వాళ్ళు కాబట్టి మీటింగులకి జనం బాగానే వచ్చేవారు. ఒకసారి అలాంటి మీటింగు పెట్టి మైకులో పాటలు అదరగొట్టేస్తున్నారు. మా పెద్దక్క ఈ పాట వెయ్యమని అడగమంది. చాలా చిన్న వాళ్ళం నేను, మా చెల్లెలు ప్రభావతి పరుగెత్తుకు వెళ్ళి హే లీచే లియే పాట వెయ్యండి అని అడిగాము.  వాడికి అర్థం అయ్యి పాట వేశాడు. మా అక్క చాలా సంతోషంగా వింది. ఇదీ తలుచుకుని నవ్వుకున్నాను.
గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు వుంటాను – (1969) భలే తమ్ముడు
మా నాన్నగారికి  మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటంటే చాలా ఇష్టం.
మా ఇంటి రోడ్డులోనే  ఎద్దనపూడి వాళ్లలాగే బాగా సెటిలయిన కుటుంబం మామిడి వెంకటేశ్వర రావుగారు వాళ్ళు. వాళ్ళకి బట్టల కొట్టు వుండేది. అప్పట్లో అది చాలా గొప్పగా వుండేది. ఒక అమ్మాయి బొమ్మకి చీర కట్టి పెట్టడం మా వూళ్ళో వాళ్ళ షాపులోనే మొదలయ్యింది. దాన్ని చూడడానికి అస్తమానం వెళ్ళేవాళ్ళం. ఇంతకీ ఏమిటంటే వాళ్ళ అబ్బాయికి పెళ్ళయింది. ఆ పెళ్ళి అయ్యాక ఊళ్ళో వాళ్ళకి ఫంక్షన్ చేశారు. వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద కాంపౌండ్ వాల్, గేటుతో కొన్ని ఇళ్ళ సమూహంతో ఒక స్థలం వుండేది.  అక్కడ వాళ్ళు ఫంక్షన్ చేశారు. అప్పట్లో వాళ్లు సినిమా పాటలు పాడేవాళ్ళని పిలిపించి రకరకాల పాటలు పాడించారు. అది ఆ రోజుల్లో చాలా ఖర్చుతో కూడిన పని.  వాళ్ళు ఈ గోపాల బాల పాట పాడారు.  సినిమాలో రామారావు, కె.ఆర్. విజయ పాడిన పాట వాళ్ళు అలాగే పాడారు.  మా నాన్నగారు అబ్బా ఎంత బాగా పాడుతున్నారో అమ్మాయి కూడా బాగా పాడుతున్నట్లుంది అన్నారు. అయితే మేము చూసి వచ్చి అమ్మాయి లేదు నాన్నా అన్నాము. కానీ మా మీద నమ్మకం కలగలా. తనే వచ్చి పాటయ్యే వరకు నిలబడి విని చాలా ఆశ్చర్యపోయారు.  ఇప్పటికీ నేను ఆ పాట విని అవన్నీ తలుచుకుంటాను.
పాండవులు పాండవులు తుమ్మెదా... పంచపాండవులోయమ్మ తుమ్మెద.... అక్క చెల్లెలు
ఈ పాట వినగానే మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తుకు వస్తాయి. మా క్లాసులో నేను, సరస్వతి  ఒక బెంచీమీద కూర్చునేవాళ్ళం.     ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతోంది. అందరికీ మా మాస్టారు ఒక లెక్క ఇచ్చి చెయ్యమన్నారు. సరస్వతి ఆన్సర్ వచ్చేసిందిట ఉన్నట్టుండి పాండవులు పాండవులు తుమ్మెదా...  అని గట్టిగా పాడేసింది. నేను నవ్వాపుకోలేక గట్టిగా నవ్వేశాను. తనూ నవ్వింది. కానీ మా ఇద్దరినీ క్లాసయ్యేవరకూ మా మాస్టారు నిలబెట్టారు.


ఫూలోంకా తారోంకా సబ్ కా కహనా హై – (1971) హరే రామ హరే కృష్ణ
ఈ పాట చాలా అద్భుతమైన పాట. నా పైన ఉన్న ఇద్దరు అక్కలు రమ, ఉమ. వాళ్ళకి హసీనా అని ఒక అందమైన ముస్లిం స్నేహితురాలు వుండేది. మా ఢిల్లీ అక్క ఆ అమ్మాయిని తుమ్ హసీన్ మై జవాన్ అనేది. వాళ్ల చెల్లెలు ఈ పాట పాడగా వాళ్ళు విని నాకు ఇంటికి వచ్చి చెప్పారు. అయితే ఒకరోజు ఆ ముస్లిం అక్కచెల్లెళ్ళు ఇద్దరూ మా యింటికి వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయిచేత ఫూలోంకా తారోంకా సబ్ కా కహనా హై పాడించుకున్నాను. చాలా బాగా పాడింది. అది అలా గుర్తుండిపోయింది. అప్పటి నుంచి పూర్తి పాట విందామని అనుకున్నాను. కుదరలేదు. ఇప్పుడు విని ఆనందించాను.

ఆరిపేయవె దీపమూ ఎలుగులో నీ మీద నిలపలేనే మనసు – ఎంకి పాట
కొమ్మలో కోయిలా కో యంటదే...  – నండూరి సుబ్బారావుగారి ఎంకి పాట
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా కాలేజీ సినిమా పాటలు పాడే ఆనంద్ గారు వచ్చారు. ఆయన చాలా పాటలు పాడారు. ఆయన ఎవరైనా పాటలు పాడేవాళ్లుంటే పాడండి అంటే నేను ఈ రెండు పాటలూ పాడాను. చాలా మెచ్చుకున్నారు.  నేను కాలేజీలో ఏదో ఒక సందర్భంలో పాటలు పాడుతూ వుండేదాన్ని.
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా.... – అమెరికా అమ్మాయి
ఆనంద్ పాడిన పాట. సంవత్సరం గుర్తులేదు.
మా వూళ్ళో వుమెన్స్ కాలేజీ కొత్తగా పెట్టారు. ఆ కాలేజీకి మేము ఫస్ట్ బాచ్. మేము డిగ్రీలో ఏడుగురం అమ్మాయిలం వుండేవాళ్ళం.  మా లెక్చరర్స్ కి మేమంటే చాలా ఇష్టంగా వుండేది. డిగ్రీ మూడవ సంవత్సరంలో వుండగా మాకు ఫేర్ వెల్ ఇవ్వడానికి మా లెక్చరర్స్ వాళ్ల ఇంటికి పిలిచారు. సరదాగా ఇంట్లో పాటలు పాడుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం. అదొక మధుర స్మృతి. ఆ సమయంలో మా పాలిటిక్స్ మేడం ఒక వేణువు వినిపించెను పాట పాడారు. చాలా బాగా పాడారు. నాకు అది అది నచ్చింది. నేను వెంటనే నేర్చుకుని చాలా చోట్ల పాడాను. అందరూ మెచ్చుకున్నారు. నేను ఆ పాట కోసం చాలా వెతికాను. ఈ మధ్య యూట్యూబ్ లో విని చాలా సంతోషించాను. అంతే కాకుండా కాలేజి స్మృతుల్లో మునిగి తేలాను. ఆ పాట వింటుంటే ఎంత హాయిగా వుందో.
చిలకమ్మ చెప్పిందోయ్ చల్లని మాట, నా కలలన్ని త్వరలోన పండేనట చిలకమ్మ చెప్పింది సినిమా.
మేము డిగ్రీ చదువుతున్నప్పుడు కార్తీకమాసం పిక్ నిక్ పోగ్రాం వేశారు. అయితే మేము అనుకున్న రోజుకి రెండు రోజుల  ముందు నుండి తుఫాను మొదలయ్యి వర్షం ఆగకుండా సన్నని తుంపర పడుతోంది. దానితోబాటు గాలి. మా కాలేజి రిప్రజెంటేటివ్ ఉషశ్రీ ప్రిన్సిపాల్ శేషూ అయ్యంగార్ దగ్గరకి వెళ్ళి ఇంకో రోజు పెట్టుకుందాం అంది. కానీ ఆయన ఒప్పుకోలేదు. అందరూ ఎగిరారుగా నడవండి అన్నారు. ఇంక చేసేది లేక అందరూ బాచ్ లు బాచ్ లు గా నడుచుకుంటూ ఊరి బయట మామిడి తోటకి బయల్దేరాం. ఆ సన్నటి వర్షంలో హాయిగానే వుంది. అక్కడ ఆ తోట యజమానులకి పెద్ద పెంకుటిల్లు వుంది. వాళ్ళు మా అందరికీ అంటే ఇంచుమించు 200 మందికి అందులో కూచోవడానికి అనుమతిచ్చారు. అందరం గ్రూపులు గ్రూపులుగా కూచుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకున్నాం. ఆ టైములో మా రిప్రజెంటేటివ్ ఉషశ్రీ చెల్లెలు సుధశ్రీ చిలకమ్మ చెప్పిందోయ్ పాట చాలా చక్కగా పాడింది. పాట స్టయిల్ చాలా బాగుంటుంది. ఆ పాట పూర్తిగా దొరికితే బాగుండును అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఆ పాటలోలాగా కలల రాజకుమారుడు వచ్చాడు. మా వనమహోత్సవం గురించి రాయాలంటే చాలా పేజీలు అవుతుంది. అప్పుడు రకరకాల అనుభూతులు.  ఆ పాట తలుచుకుంటే ఆ తుఫాను, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. వర్షం పెద్దదయ్యేసరికి మా అందరికీ క్రోసిన్ టాబ్లెట్లు కొనిచ్చి, లారీలో అందరినీ ఎవరి ఇళ్ళదగ్గర వాళ్ళని దింపారు. నన్నయితే ఇంచుమించు కిలో మీటరు దూరంలో వర్షంలో దింపేసి పోయారు. రాత్రి 7 గంటల సమయం. రోడ్డు మీద ఎవరూ లేరు. 19 సంవత్సరాల వయస్సు. చీకట్లో, వర్షంలో ఒక్కదాన్నీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఆ రోజులు కాబట్టి, ఊళ్ళో అందరికీ మేమందరం బాగా తెలుసు కాబట్టి సేఫ్ గా ఇంటికి చేరాను. అమ్మ వేడి వేడి నీళ్ళు స్నానానికి రెడీ చేసింది. స్నానం చేసి అమ్మ పెట్టిన వేడన్నం తిని నిద్రపోయాను. భలే అనుభూతి.
ఆనాటి చెలిమి ఒక కల, కలకాదు నిజము ఈ కల (1968) పెళ్ళిరోజు
ఈ పాట వినగానే మా ఫేర్ వెల్ రోజులు గుర్తుకు వచ్చాయి. మా డిగ్రీ చివరలో కాలేజీలో మా జూనియర్స్ ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు.  ఈ పాటని మా పెద్దక్క అన్నపూర్ణ మా  స్టూడెంట్స్ కి తగినట్లుగా మార్చి రాసి నాకు నేర్పింది. నేను మా పార్టీలో పాడాను. అందరూ చాలా సంతోషించారు.
ఇలా ఇంకా మరెన్నో పాటల మధురస్మృతులు గుర్తుకొస్తూనే వున్నాయి. నేను ఆనందించి చాలామందితో పంచుకుని వాళ్ళని ఆనందింపచేశాను.












26, జులై 2015, ఆదివారం

తానా సజీవ చరిత్ర
రచన:
నరిసెట్టి ఇన్నయ్య
                     

తానా ఎలా ఆవిర్భవించింది ?
(ఉత్తర అమెరికా తెలుగు సంఘం)
ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం 1979లో డెట్రాయిట్ లో జరిగిన సందర్భంగా నామకరణం జరుపుకున్నది. దీనికి బీజాలు 1977 తొలి సమావేశంలో అంకురించాయి. సమ్మేళనం చివరలో వివిధ ప్రాంత తెలుగు సంఘాలవారంతా సమావేశమై చర్చలు జరిపి, వాటిని అమలుపరచటానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘాల సభ్యత్వంతో ఒక జాతీయ సంఘాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకు గాను ఒక సమన్వయ కార్యవర్గాన్ని ఏర్పరచారు. డా. కాకర్ల సుబ్బారావు సమన్వయ కర్త కాగా డా. గుత్తికొండ రవీంద్రనాథ్, బండారు శివరామిరెడ్డి, తుమ్మల మాధవరావు, మన్నె రమణరావు సభ్యులుగా ఉన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని తొలుత నామకరణం చేసి ఈ కార్యవర్గం ఆధ్వర్యాన వాషింగ్టన్ డి.సి.లో పేరుపెట్టి 1978లో మేరీలాండ్ రాష్ట్రంలో తానాను రిజిస్టర్ చేశారు. అందు నిమిత్తం రూపొందించిన నియమ నిబంధనావళిని (రాజ్యాంగ సూత్రాలను) ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆవిధంగా తానా పేరు (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అంకురించింది. 1979లో తానా సభలు డెట్రాయిట్ లో జరపాలని కూడా అప్పుడు నిర్ణయించారు. కాకర్ల సుబ్బారావు అధ్యక్షులుగా, తుమ్మల మాధవరావు కార్యదర్శిగా, ముక్కామల అప్పారావు కోశాధికారిగా తాత్కాలిక సంఘాన్ని ఏర్పరచి, తానా రాజ్యాంగాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకుగాను జాస్తి వెంకటేశ్వర్లు, రామినేని అచ్యుతరావులతో ఒక సంఘాన్ని ఏర్పరచారు. దాని ప్రకారం ప్రాంతీయ తెలుగు సంఘాలకు తానాలో సభ్యత్వం ఉంటుంది. ప్రాంతీయ సంఘానికి కనీసం 25మంది సభ్యులు ఉండాలి. ఆ సంఘం తమ ప్రతినిధిని తానా సర్వసభ్య సమావేశానికి పంపించాలి. సర్వసభ్య సమావేశంలో తానా కార్యవర్గాన్ని తొలుత ఎన్నుకున్నారు. రెండేళ్ళకోసారి తానా ఎన్నికలు జరుగుతాయి. కాలక్రమేణా  సభ్యుల సంఖ్య పెరగడం కారణంగా తానాకు ప్రత్యక్ష సభ్యత్వం ఉండాలని భావించారు. తానా రాజ్యాంగంలో ఆమేరకు ఉత్తరోత్తరా మార్పులు చేశారు. సాంవత్సరిక సభ్యత్వాన్ని (by annual membership) తొలగించి వ్యక్తి సభ్యత్వాన్ని జీవిత సభ్యత్వాన్ని కల్పించారు. 1995లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కార్యవర్గాన్ని కూడా తొలుత ఏర్పరచారు. తానా ఫౌండేషన్ 1981లో సృష్టించారు. తానా ఫౌండేషన్ లో కార్యక్రమాలు సాగించడానికి వీలుగా ఫౌండేషన్ ట్రస్టీ ఏర్పడింది.. 2009లో పేరు మార్చి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని కూడా అన్నారు. రెండేళ్ళకోసారి తానా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తానా రాజ్యాంగాన్ని అమలుపరచుటకు వీలుగా నిధులను సక్రమంగా వినియోగించే పద్ధతిలో కొన్ని మార్పులు చేశారు. ఇది తానా కట్టుదిట్టంగా కొనసాగటానికి ఉపయోగపడింది.
తానా మహాసభలు
తానా చరిత్ర సజీవమైనది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం చరిత్రకు ఆది ఉన్నది గాని, అంతం లేదు.  భారత దేశం నుండి అమెరికా వచ్చిన వివిధ భాషా సంఘాల ప్రజలు ఏర్పరచుకున్న జాతీయ సంఘాలలో తానా ప్రథమ స్థానంలో ఉన్నది. ఏ భాషా సంఘానికి దక్కని అపూర్వ గౌరవం, ఘనత తానాకు లభించింది. అత్యంత జనాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తానా సభలకు వచ్చి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో సుదీర్ఘ ఉపన్యాసం చేసి గౌరవించారు. అటువంటి ప్రత్యేక స్థానాన్ని అలరించే తానా చరిత్ర ఇది. 19 మహాసభలు జయప్రదంగా ముగించి 20వ పర్వం జరుపుకునే దశలో ఈ చరిత్ర రచన ఆరంభమయింది.
తానా చరిత్రలో ప్రధాన ఘట్టాలుగా రెండేళ్ళకోసారి జరిగే సభలు, జనాదరణ పొందుతూ సేవలు అందిస్తున్న ఫౌండేషన్, తానా విశేషాలను సమాచారాన్ని అధునాతన సూచనలను అందిస్తున్న తానా మాసపత్రిక మరొక మణిపూస. అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఎప్పటికప్పుడు సమస్యాపరిష్కారం వైపుకు పయనించే ధోరణి తానా చేపట్టింది. ఈ చరిత్ర రచన జరుగుతున్నప్పుడు తానా అధ్యక్షులుగా మోహన్ నన్నపనేని ఉన్నారు. ఆయనతోబాటు ఎంపిక అయిన సంఘం చేస్తున్న పనులు తానాకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెడుతున్నాయి. ఇదే ఉత్తరోత్తరా కొనసాగుతుంది.
తానా ఇలా మొదలయింది
నదుల పుట్టుకకు మొదలెక్కడో చెప్పటం కష్టం . చిన్న చిన్న పాయలుగా ప్రారంభమై మధ్యలో వచ్చి చేరిన పిల్లకాలువలను, ఉపనదులను కలుపుకుంటూ క్రమేణా విశాలంగా మారి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా పరిణమిస్తుంది. అలాగే తానా కూడా అతి సామాన్యంగా ఆరంభమై వేర్లు పాతుకున్నది.
తానా అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం. (TELUGU ASSOCIATION OF NORTH AMERICA) అమెరికాలో భారతదేశం నుండి వచ్చి స్థిరపడిన వివిధ భాషలవారు సంఘాలు పెట్టుకున్నావాటన్నిటిలో కూడా దేశస్థాయి సంఘంగా తానాకే ప్రథమ పీఠం లభిస్తుంది. నానాటికీ బలపడుతున్న తానా అమెరికాలో అధ్యక్షస్థానం నుండి అన్ని స్థాయిలవారినీ సభలకు ఆహ్వానించి అలరించగలిగింది.
ఆర్భాటాలు లేని తానా తొలి మహాసభలు న్యూయార్క్ నగరంలో జరిగినప్పుడు దీర్ఘకాలం కొనసాగే రీతిలో గట్టి పునాదులు వేశారు. అధికారికంగా అప్పటికి తానా అన్న పేరు రాలేదు. అనేకమంది త్యాగాలు చేసి సమయం వెచ్చించిన తీరుకు క్రమేణా సత్ఫలితాలు దక్కాయి.
అలాగే 1983 వరకూ అతి వినయంగా హైస్కూళ్ళలో సమావేశాలు జరుపుకుంటూ, కమ్యూనిటీ హాళ్ళలో చర్చలు చేస్తూ, ఇళ్ళ నుండి సమకూర్చిన భోజన ఫలహారాదులు సేవించి, అటు ఉపన్యాసాలు, ఇటు సాంస్కృతిక ఉత్సవాలు ఆనందించారు.
ఆర్భాటాలు లేని తానా తొలి సభల ప్రాధాన్యత దృష్ట్యా చాలా వివరంగా విశేషాలను లభించినమేరకు పొందుపరుస్తున్నాము.
అటు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఇటు భారత అధ్యక్షులు కె. నారాయణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, తెలుగువారి ఖ్యాతిని దేశవిదేశాలలో చాటిన నందమూరి తారకరామారావు, పి.వి. నరసింహారావు, చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, యం. బాగారెడ్డి, ఆవుల మదనమోహన్, వెంకయ్యనాయుడు, పురంధరేశ్వరి, రామోజీరావు, వేణుగోపాల్ రెడ్డి వంటి నాయకులు సభలలో పాల్గొని తమ సందేశాలతో ఎంతో ప్రాధాన్యతను సమకూర్చారు. తానా ఇలాంటి ఘట్టాలతో నిరంతర చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నది.
                                                              మొదటి మహాసభల
బేనర్ ని గుత్తికొండ రవీంద్రనాథ్ ,
వారి సతీమణి పద్మ తయారు చేశారు.
తానా ఆవిర్భావం - ప్రారంభసభ
1977లో అమెరికాలోని తెలుగువారితో సంఘ స్థాపన ఆలోచన చేసిన ఆద్యుడు డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్.
న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో, ఇండియా క్లబ్ కార్యనిర్వాహకవర్గ సభ్యుడుగా గుత్తికొండ రవీంద్రనాథ్  రకరకాల పదవులలో పనిచేసారు. న్యూయార్క్, న్వూజెర్సీ, కనెక్టికట్ త్రైరాష్ట్రీయ సారస్వత, సాంస్కృతిక సంఘం కార్యవర్గాలలో పనిచేసిన అనుభవాలు సముచితంగా తెలుగు సంస్కృతి పెంపొందించడానికి తోడ్పడ్డాయి. 1976 జూలై 4న  అమెరికా ద్విశత వార్షికోత్సవ వేడుకల్లో తెలుగు దేశభక్తి గేయాలతో కొలంబియా యూనివర్సిటీ రేడియో ప్రసారం చేసింది.  న్యూయార్క్ లో ప్రవహించే  “హడ్సన్ నదీతీరాన కూర్చుని అంతర్జాతీయ ఓడల విన్యాసాన్ని చూసి మన తెలుగు సంస్కృతికి కూడా అమెరికాలో గుర్తింపు వస్తే బాగుంటుందనే” ఆలోచన గుత్తికొండ రవీంద్రనాథ్.కు కలగడం ఆయన మరపురాని సన్నివేశాలలో ఒకటిగా నిలబడిపోయింది.
గుత్తికొండ రవీంద్రనాథ్.కు మద్దత్తు పలికిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు సంఘస్థాపనకు దారితీశారు. వారిరువురి ఆలోచన నాటికే అమెరికాలో వాషింగ్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, డెట్రాయిట్, చికాగో, హ్యూస్టన్, కెనడాలోని టొరంటోలలో స్థానిక తెలుగు సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. వారిని కూడా సంప్రదించి, వారి సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘ స్థాపనకు పూనుకున్నారు.
1976 ఆగస్టు 26న డా. కాకర్ల సుబ్బారావు, డా. గుత్తికొండ రవీంద్రనాథ్.లు తెలుగు సమ్మేళనం గురించి చర్చించారు. తర్వాత వారు డా. బండారు శివరామరెడ్డి, కిడాంబి రఘునాథ్, త్రిపిర్నేని తిరుమలరావు, గండికోట సూర్యారావులతో కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అమెరికాలోని తెలుగు వారిని సంప్రదించారు. వెలువోలు బసవయ్య, డా. మాధవరావు తుమ్మల, వంగూరి చిట్టెన్ రాజు, మన్నేరమణారావు సమ్మేళనాన్ని నిర్వహించేందుకు తోడ్పాటునిచ్చారు.
1977 మే 27, 28 తేదీలలో న్యూయార్క్.లో మొదటి తెలుగు సమ్మేళనం జరిపారు. ఆ సభలకు కన్వీనర్ గా          డా. రవీంద్రనాథ్ గుత్తికొండ, సావనీర్ కమిటీ ఛైర్మన్.గా వెంపటి కృష్ణమూర్తి, ఆహార కమిటీ ఛైర్మన్.గా శ్రీమతి లక్ష్మీ సుబ్బారావు కాకర్ల, సాంస్కృతిక కమిటీ ఛైర్మన్.గా డా. ఘండికోట సుబ్బారావులు వ్యవహరించారు. తేళ్ళ తిరుపతయ్య (షికాగో), డా. తుమ్మల మాధవరావు (డెట్రాయిట్), డా. తాతయ్య కోనేరు (హూస్టన్), కొండవలస శ్యామసుందరరావు (ఎడ్మంటన్, కెనడా). శ్రీమతి డా. బండారు సుభాషిణీ రెడ్డి (మెట్రోపాలిటన్ న్యూయార్క్), కె. రామకృష్ణారెడ్డి (ఫిలడెల్ఫియా), వెలువోలు బసవయ్య (టొరంటో, కెనడా) మన్నే రమణారావు (వాషింగ్టన్ డి. సి.), దూర్వాసుల శాస్త్రి (వాషింగ్టన్) లు బాధ్యతలు స్వీకరించారు.
ఎడ్మంటన్ ఆంధ్రా సాంస్కృతిక సంఘం (అల్బర్టా); కెనడా, దక్షిణ కాలిఫోర్నియా ఆంధ్ర సాంస్కృతిక సంఘం - లాస్ ఏంజలస్; గ్రేటర్ చికాగో సాంస్కృతిక సంఘం - చికాగో; తెలుగు సాంస్కృతిక సంఘం - డెట్రాయిట్; తెలుగు సాంస్కృతిక సంఘం - హూస్టన్;  తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంఘం-  న్యూయార్క్; డెలవర్ వాలీ తెలుగు సాంస్కృతిక సంఘం - ఫిలడెల్ఫియా; తెలుగు సాంస్కృతిక సంఘం - శాన్ ఫ్రాన్సిస్కో; గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆ సమ్మేళనానికి సహకరించాయి.
ఆనాటి పరిస్థితులలో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం దగ్గరున్న డబ్బు, నిధులు ఆ మహాసభకి ఉపయోగించటం మంచిది కాదని ఒక్కొక్కరికి 5 డాలర్లు, కుటుంబానికి 10 డాలర్లు, ప్రత్యేకంగా ఇవ్వగలిగిన వారి నుండి 25 డాలర్లు చొప్పున సేకరించారు. వచ్చిన డబ్బునే సద్వినియోగం చేసి వీలైనంత తక్కువ ఖర్చుతో జరిపారు.
ఆర్భాటాలు లేకుండా అతి వినయంగా న్యూయార్క్ శివార్లలో ఒక హైస్కూలులో 1977 మే లో ప్రథమ సమావేశం ఆరంభించారు. తెలుగు కుటుంబాలవారు తమ పండగగా భావించి వంటలు చేసి తెచ్చారు. వచ్చిన అతిథులకు తమ ఇళ్ళల్లో వసతి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఖర్చుతో సి. అన్నారావును  ప్రధాన అతిథిగా పంపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆనాడు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా, మండలి వెంకట కృష్ణారావు విద్యాశాఖా మంత్రిగా ఉన్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించింది.  ఆవిధంగా తెలుగువారి కలయికకు నాంది పలికారు.
సమావేశాలకు హాజరైన వారినుంచి 25 డాలర్ల చొప్పున రిజిస్ట్రేషన్ రుసుము సేకరించారు. ఆ సభలలో 310 కుటుంబాల నుండి 940 మంది వ్యక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.1977 శనివారం మే 28న ఉదయం 10 గంటలకు న్యూయార్క్ మహాసభలు ప్రారంభమయ్యాయి. కాకర్ల సుబ్బారావు అతిథులను ఆహ్వానించారు. డా. రవీంద్రనాథ్ గుత్తికొండ స్వాగతోపన్యాసం చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు బండారు శివరామరెడ్డి, సభానిర్వాహకులను పరిచయం చేసిన సుభాషిణీ రెడ్డి ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ సి. అన్నారావు ఈ సభలలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.  ప్రత్యేక (ఫిలాటలిక్) స్టాంప్ తో కూడిన సావనీర్ ను ఎస్.వి. రామారావు ఆవిష్కరించారు. ప్రత్యేక సంచిక సంపాదక వర్గానికి కాకర్ల సుబ్బారావు సారధ్యం వహించారు. బి.నాగిరెడ్డి 90 పేజీల సంచికను అచ్చువేసి చందమామ పబ్లికేషన్స్ అధినేతగా బి.విశ్వనాథరెడ్డిచే ఆ సభలకు పంపించారు.
ఆ సమ్మేళనానికి 30 రాష్ట్రాల నుంచి, మూడు దేశాల నుంచి, ఎనిమిది ప్రాంతీయ సంఘాల నుంచి 940 మంది తెలుగు, తెలుగేతర ప్రతినిధులు ఆహ్వానితులుగా వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా న్యూయార్క్ పరిసర ప్రాంతాలలో ఉన్న తెలుగువారి గృహాలలో అతిథులుగా ఉండటం, ఏ ఒక్కరూ హోటళ్ళలో ఉండే అవసరం లేకపోవడం మన తెలుగుతనానికి, ఆదరాభిమానాలకి మరపురాని సంఘటన. వారిని అతిథులుగా ఆహ్వానించటమే కాకుండా వారి రవాణా సౌకర్యాలు, అల్పాహార సౌకర్యాలు చేసిన తెలుగు కుటుంబాలు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమైంది.
ప్రప్రథమ ఉత్తర అమెరికా మహాసభకి 940 మంది ప్రతినిథులు 6,600 డాలర్ల వ్యయంతో విజయవంతం గావించారు.
ఈ సమావేశంలో శ్రీమతి ప్రభ రఘునాథ్  ప్రార్థనాగీతాన్ని పాడారు. శ్రీమతి శమంతకమణి మూర్తి ముక్కవల్లి తెలుగులో సమావేశపు ప్రారంభ గీతాన్ని రచించారు. దానిని శృతి చేసి వారి కుమార్తె శ్రీమతి లలితతో కలిసి పాడారు.
స్వాగతము  స్వాగతము  సుస్వాగతము                                      స్వా
అతిరథులు మహారథులు
అఖిల జగముల వెలుగు మహనీయులకును సుస్వాగతం                 స్వా
తేట తేనియలొలుకు తెలుగు వెలుగుల పలుకు
తెలుగు తల్లి మనకు చేయూతనీయగా
భరత ఖండపు ఖ్యాతి భారతీయల కీర్తి
భువనమ్ము పొగడగా పాడి వినిపిద్దాము                                      స్వా
ఏ దేశమందైన ఏ ప్రజల ముందైన
ఏ నాటికి మనము ఏకమై ఉందాము
మనమంత ఒకటిగా ముందడుగు వేదాము
మనముందు తరమునకు మణిపూస లౌదాము                           స్వా
వేదికపై ఉన్న అతిథులు :
డా. గుత్తికొండ రవీంద్రనాథ్, శ్రీ తిపిర్నేని తిరుమలరావు, శ్రీ మన్నే రమణరావు, శ్రీ వెలువోలు బసవయ్య, శ్రీ రమాకృష్ణ, డా. తుమ్మల మాధవరావు, డా. సుభాషిణి రెడ్డి, శ్రీమతి అనసూయ, శ్రీ సి. అన్నారావు, శ్రీ బి. కృష్ణంరాజు, శ్రీ ఎస్.వి. రామారావు, పద్మభూషణ్ జి.ఏ. నరసింహారావు, శ్రీ వెంపటి కృష్ణమూర్తి, శ్రీ కె. రామకృష్ణారెడ్డి, శ్రీ తేళ్ళ తిరుపతయ్య, డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, డా. బి.యస్.రెడ్డి వీరందర్నీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు పరిచయం చేసారు.
సభా కన్వీనర్ డా. గుత్తికొండ రవీంద్రనాథ్ స్వాగతోపన్యాసం :
“భారతావని అనే పుట్టింటి నుండి ఉత్తర అమెరికా అనే మెట్టిన యింటికి వచ్చిన మనకు తెలుగు జాతి నిండు గర్వాన్ని నిలుపాల్సిన బాధ్యత యెంతైనా ఉంది.  అది మనం చేయబోయే ప్రయత్నాలకు నాంది.
ఈ ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం … డాక్టర్ కాకర్ల సుబ్బారావుగారి ప్రోత్సాహంతో ఆగస్టు 28, 1976 నుండి చేసిన శ్రమ ఫలితం … అయితే, యీ సమ్మేళనం ముఖ్యోద్దేశ్యం యేమిటి? మనం చేయగలిగిందేమిటి? మనం సాధించగలిగిందేమిటి ? మన తెలుగు సంస్కృతి ఉత్తర అమెరికాలో ఉన్న సంస్కృతులతో పరిపూర్తిగా మిళితం కాకపోవటం మూలంగా మనం మన దైనందిన సాంఘిక జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి, తదనుగుణంగా పరిష్కార ప్రతిపాదనలను రూపొందించి, వాటి సారాంశాలన్నిటిని ఆచరణలో పెట్టటమే యీ సమ్మేళనం ముఖ్యోద్దేశ్యం! ఈ సమ్మేళనం ద్వారా మనం సాధించగల ప్రతిపాదనలు అనేకం రూపొందించబడ్డాయి.
వాటిని ఆచరణలో పెట్టడానికి ఉత్తర అమెరికాలో ఉన్న ప్రాంతీయ సంస్థలనన్నిటినీ సమిష్టిగా ఒకే సంస్థగా చేయడం, ఈ సమ్మేళనంలో ఆదర్శనీయాలుగా ప్రకటించబడిన సారాంశాల్ని వివిధ పద్ధతులలో ఆచరణ పెట్టడం, తెలుగువారు నివసిస్తున్న, తెలుగు సంస్థలు లేని ప్రదేశాలలో వాటిని నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందించడం, తెలుగు వారికి, ఉత్తర అమెరికా వారికి పరస్పర స్నేహ సంబంధములను రూపొందించడానికి అవసరమైన ప్రతిపాదనలని రూపొందించి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు చేయడం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహకరించి  సారస్వత, సాంస్కృతిక రంగాలలో పరస్పర కార్యక్రమాల్ని అమలు జరుపటం. ఉత్తర అమెరికాలో ప్రాంతీయ తెలుగు సంస్థలన్నింటికీ, యితర తెలుగు వారికి తమ ప్రతిభా ప్రదర్శనలకోసం ఒకే వేదిక మీద తెలుగు సారస్వత సాంస్కృతిక కార్యక్రమాలలో తరచు సదవకాశమును కల్పించటం. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో ఉన్న భారతీయులందరికీ ప్రతినిథి సంస్థలుగా కృషి చేస్తున్న కొన్ని సంస్థలకి మనం యథాశక్తితో సహకరించటం. ఈ సమ్మేళనాల సందర్భంగా, విదేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రముఖులకు తదనుసారముగ సన్మానాలు జరపడం. … అయితే, యివన్నీ సాధించడం ఎలా?… ఇందుకు, మనం చాలా అంశాల్ని చర్చించాల్సిన అవసరం ఉంది … అందులో కొన్ని అంశాలు మన సాంఘిక వ్యవస్థలో మనం ప్రతిదినం ఎదుర్కొంటున్నవే. అందులో ఉత్తర అమెరికాలో మన తెలుగు పిల్లలని పెంచే విధానం, ఉన్నత విద్య, వివాహాలు, గృహిణిగా స్త్రీ బాధ్యత, ఉత్తర అమెరికాలో సాంస్కృతిక, భాషా సంఘాలు మన సంస్కృతిని ఎలా వ్యాప్తి చెయ్యాలి? ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగు వారి చిన్నతరహా పరిశ్రమల అభివృద్ది.
ఇవన్నీ కూలంకషంగా చర్చించడానికి 30 రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి అనేకమంది యిక్కడకు వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం దాదాపు 110 మంది వివిధ నగరాల నుండి వచ్చారు. మన సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్యంగా మన తెలుగుదేశంలో కూడా మరచిపోతున్న కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అవి, హరికథ, బుర్రకథ లాంటివి. మనవాళ్ళంతా యితర నగరాల నుండి కూడా వచ్చి ఎంతో ఉత్సాహంతో యిలాంటి కార్యక్రమాలకు మరల పునాదిరాళ్ళు త్రవ్వగలుగుతున్నారంటే అది చాల హర్షించదగ్గ విషయం.
ఈ మహాయజ్ఞం మనకందరికీ నూతన ఉత్సాహం కలిగించి ఉత్తరోత్తరా మనకు, మన ముందు తరముల వారికి అనేక విధాల మార్గదర్శి అవుతుందని ఆశిద్దాం. ఈ ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం భవిష్యత్తులో మన తెలుగు వారు తలపెట్టే తెలుగు సమ్మేళనాలకి, తెలుగు సంక్షేమ కార్యక్రమాలకి మొదటి మెట్టుగా పేరు పొంది ఉత్తర అమెరికాలో మన తెలుగు వ్యక్తిత్వానికి గుర్తింపునివ్వడానికి ఒక పునాదిరాయి అవుతుందని ఆశిద్దాం”.
ప్రథమ మహాసభ సందర్భంగా అందుకున్న శుభ సందేశాల్ని వెంపటి కృష్ణమూర్తి చదివారు -
విద్యా సాంస్కృతిక శాఖామంత్రి ఎమ్. వి. కృష్ణారావు :
“కార్యభారం వల్ల ఎంత ప్రయత్నం చేసినా ఈ సమ్మేళనములో పాల్గొనే అవకాశం పొందలేకపోయాను. ఈ సమ్మేళనం విజయవంతం కావాలని, దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వారికి చిరస్థాయిగా ఉండే ప్రయోజనాలు సమకూరాలని నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను…”
పి.ఎస్. రాజగోపాల రాజు (తిరుపతి దేవస్థానం) :
“తరతరాల తెలుగు సంస్కృతిని, నాగరికతను పునరాలోచించడానికి యిటువంటి సమావేశాలలో అవకాశం కావలసినంత ఉంది. త్రికరణ శుద్ధితో మీరు నిర్వహించే యీ కార్యకలాపాలు చూసిన తెలుగు తల్లి నయనాలలో ఆనందభాష్పాలే వస్తాయి.”
అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు,  పి.ఎస్.ఆర్. అప్పారావు (డైరక్టర్, ప్రపంచ తెలుగు సంస్థ హైదరాబాద్), దాశరథి రంగాచార్య (కవి), డా. సి. అప్పారావు - (ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ మలేసియా) కూడా సందేశాలు పంపారు.
ముఖ్యఅతిథి సి. అన్నారావును జి.ఎ. నరసింహారావు పరిచయం  చేశారు.
అన్నారావు ప్రసంగం :
“ఉత్తర అమెరికాలో తెలుగు మహాసభ ఇక్కడ జరగడం, అందులో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు అనివార్య కారణాలవల్ల రాలేక నన్ను ఈ సమావేశానికి తప్పక హాజరు కమ్మన్నారు. తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా సహాయపడుతోంది. ‘ప్రపంచ తెలుగు సంస్థ’ ద్వారా తెలుగు భాషా బోధనకు స్కూలు బిల్డింగ్ కట్టడానికి అక్కడున్నవారు మూడవభాగం ఖర్చు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక భాగం, తిరుపతి దేవస్థానం ఒక భాగం ఇస్తోంది.
అందరూ సమావేశం కావడానికి, యితర కార్యక్రమాలు నిర్వర్తించడానికి, ముఖ్యంగా మన సంస్కృతిని మర్చిపోకుండా నిలబెట్టడానికి ఒక కమ్యూనిటీ హాలు, మన దేశం నుండి వచ్చినవారికి  ఒక వసతి గృహం చాలా అవసరం. కమ్యూనిటీ హాలు, గెస్ట్ హౌస్ కట్టడం మాత్రం మానొద్దు.  అమెరికాలో ఉన్న వారు తమ పిల్లలకు భారతదేశంలో చదువు చెప్పించాలని అనుకుంటే తగిన వసతులు కల్పించడానికి భారత ప్రభుత్వం కొన్ని కేంద్రీయ విద్యాలయాలని గురుకుల కేంద్రీయ విద్యాలయాలుగా మార్చి అందుకు అవకాశం కల్పించింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాఠశాలలు కట్టించే విషయంలోనూ, సభాభవనం కట్టడానికి సహాయ పడుతుంది”.
ఫిలడెల్ఫియా నుంచి వచ్చిన శ్రీ కె. రామకృష్ణారెడ్డి, వాషింగ్టన్ నుంచి వచ్చిన మన్నే రమణారావు ఉపన్యసించారు.
డాక్టర్ తుమ్మల మాధవరావు (డెట్రాయిట్)
“తెలుగు వారు ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా‘ అనే నినాదంతో ఎంతో చక్కగా ఏర్పాట్లు చేసారు. ఎనిమిది వందలకు పైగా వివిధ ప్రాంతాల నుండి వచ్చారంటే, వారు పడిన కష్టానికీ, పట్టుదలతో ఇలా చేయగలగడం ఒక ఉదాహరణ. మేమంతా డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రారంభించాం. యీ తెలుగు మహాసభల వార్తలను సంతోషంగా అందుకున్నాం. డెట్రాయిట్ ప్రాంతం తెలుగు వారందరి అభివందనాలతో, యీ సభలు జయప్రదం కావాలని అభిలషిస్తూ ముగిస్తున్నాను.“
వెలువోలు బసవయ్య (టోరంటో)
“ఇది ప్రాంతీయోన్మాదుల సభకాదు. భాషోన్మాదుల సభ అంతకన్నా కాదు. మనమంతా ఆత్మస్తుతికి సమావేశమైన జనం కాదు. దేశానికి దూరంగా ఉన్నా మన భాషకు, ఆచార వ్యవహారాలకు దూరం కాలేదని, కాలేమని మనం వెల్లడి చేసుకోవడానికీ, మన సాధక బాధకాలను చర్చించుకోవడానికీ మాత్రమే యిక్కడ సమావేశమయ్యాం… 19వ శతాబ్దం మొదటి రోజులలో ఎంతోమంది తెలుగువారు, మిగతా భారతీయులతో అమెరికా, ఆఫ్రికా ఖండాలకు వలసపోయారు. వారంతా అధికంగా నిరక్షరాస్యులు… అయినా, అధిక సంఖ్యా, భాషా వర్గాలకు లొంగిపోకుండా, ఇంకా తెలుగు వారమని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎక్కడున్నా మిగతా భాషల వాళ్ళు, వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి కూడా గొప్పదని చెప్తారు. కానీ మన గొప్పేమిటనుకుంటే … ఎవరి గొప్ప వాళ్ళకుంది … మనమూ గొప్పవాళ్ళమే;  మన సంస్కృతి, మన భాష గొప్పదే; మనకి పెద్ద చరిత్రవుంది;  మనమెవరికీ తీసిపోము అనేటటువంటి ఆత్మస్థైర్యం, మన భావి జీవితచరిత్రని తీర్చి దిద్దుకోవడానికీ, మన పిల్లలకి విశ్వాసం కలిగించడానికీ ఎంతైనా అవసరం. ఏ దేశానికైనా, ఏ భాషా వర్గాలకైనా వారి వారి చరిత్రల్లో ఒడుదుడుకులు, మంచి చెడులు వుంటాయి. భావి చరిత్రకారులు మన తరాన్ని గురించి బాగా రాయడానికి, అటువంటి అవకాశాన్ని కలిగించడానికి ఇటువంటి ప్రయత్నం చేయడం చాలా సమంజసం. దానికి అనువుగా మనం, పిల్లలు వ్యవహరించడానికి, అలాంటి సాధక బాధకాలని అన్వేషించడానికీ ఇలాంటి సమావేశాలు తోడ్పడతాయి.”
శ్రీ తిరుపతయ్య తేళ్ళ (చికాగో)
“ఈ ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనాన్ని, న్యూయార్క్ మహాపట్టణంలో జరిపే సందర్భంలో చికాగో తెలుగు సంఘాన్ని అహ్వానించినందుకు నా తరఫున, మా తెలుగు సంఘము తరఫున ధన్యవాదాలు … చికాగో తెలుగు సంఘం గత ఆరు సంవత్సరాలుగా దిన దిన  ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతూ, ప్రతి సంవత్సరమూ ఏదో ఒక క్రొత్త కార్యక్రమాన్ని యేర్పాటు చేస్తూ ముందుకు సాగిపోతోంది. ప్రతినెలా ఏదో ఒక సారస్వత, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం…. ప్రప్రథమంగా అమెరికాలో ఒక తెలుగు స్కూలును ప్రారంభించి గత మూడు సంవత్సరాలుగా జయప్రదంగా నిర్వహిస్తూ, మన  సంస్కృతి, భాషల విలువల్ని మన పిల్లలకి నేర్పుతున్నామని చెప్పుకోడానికి గర్విస్తున్నాం. మన తెలుగు దేశపు బాగోగుల లోపాలు పంచుకోవడానికి ఒక తెలుగు అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టి, దాని ద్వారా అవసరమైన బీద విద్యార్థులకు, స్కూళ్లకు, హాస్పిటళ్ళకు, గ్రామాభివృద్ధికి, మాకు వీలయినంత వరకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని చేస్తున్నాం. సంఘ కార్యక్రమాల్ని సభ్యులందరికి తెలియచేయడానికి ప్రతినెలా ‘తెలుగు వెలుగు’ మాసపత్రికని ప్రచురిస్తున్నాం. మన సాంస్కృతిక విలువల్ని, భాషని, అలవాట్లని శాశ్వతంగా ఈ దేశంలో స్థిరపరచడానికి ఒక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాం. ఏ పేరు పెట్టినప్పటికీ, ఇది సంస్థాపించినట్లయితే అమెరికా, కెనడాలలో వున్న తెలుగు సంఘాలకన్నింటికీ యెంతో ఉపయోగ పుతుందని ఆశిస్తున్నాను…
డా. చిట్టెంరాజు వంగూరి, (హ్యూస్టన్)
“ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇంచుమించు ఎనిమిది నెలల క్రిందట రవీంద్రనాథ్ గారి నుండి న్యూయార్క్ వారి నుండి ఏవో కాగితాలొచ్చాయి. - ‘తెలుగు సమ్మేళనము ఏర్పాటు చేసుకుందామనుకుంటున్నాము’ అని చెప్పి. సరే, తెలుగు వాళ్ళకు ఆరంభశూరత్వమెక్కువ, వీళ్ళెక్కడ చేస్తారులే అని అనుకున్నాం. కానీ, రాను రాను చూస్తుంటే వ్యవహారం చాలా ధాటీగానే జరిగేటట్లు కనబడేసరికి, మన భాష, సంస్కృతి, సంప్రదాయాల్ని మరచిపోలేని మాక్కూడా హుషారొచ్చింది. హ్యూస్టన్ మహానగరంలో మేము మా తెలుగు సంస్కృతిక సంఘాన్ని ఒక ఏడాది క్రితం మొదలుపెట్టాం. పిక్నిక్.లు, పాటలు పాడటం, ఆడవాళ్ళు, మగవాళ్లు కలిపి డ్రామాలు వేయటం, నృత్యాలు చేయటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాల్ని క్రిందటి సంవత్సరం నిర్వహించాం. ఈ మధ్యనే, అంటే రెండు నెలల క్రితం, ఉత్తమోతత్తమైన సాహిత్యాన్ని పోషించాలని “మధురవాణి” అని ఒక తెలుగు పత్రికను మొదలుపెట్టాం. మా లోకల్ విషయాలే కాకుండా, అమెరికాలో ఎవరైనా సరే, ఎక్కడ నుండైనా సరే ఏదైనా నాలుగు ముక్కలు వ్రాసి పంపితే - నవ్వుకునేవి, నవ్వించేవి, అప్పుడప్పుడూ విచారపడేవి ఏ సంగతులైనా సరే మాకు పంపిస్తే - మా మాగజైన్.లో వేసుకుంటాం. ఈ విధంగా ఏదో మన తెలుగు దేశ సంప్రదాయాల్ని, యింతదూరం వచ్చినా నిలబెట్టాలని మేము చాల ప్రయత్నం చేస్తున్నాం. ఇలాగ న్యూయార్క్ నగరంలో యింతమంది మహానుభావులంతా కలిసి, యిటువంటి సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా ముదావహం. ఈ అవకాశం తీసుకుని, అందరికీ మా హ్యూస్టను తెలుగువారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.”
రమణారావు మన్నె (వాషింగ్టన్)
“ఈ ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం గురించి ఏర్పాట్లు చేయటంలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి - సమాచారం మాకు వస్తోంది. ఈ విషయాలన్నీ కూడా మా వాషింగ్టన్ సభ్యులతో నేను మాట్లాడాను. వాళ్ళంతా కూడా చాలా ప్రోత్సాహాన్నిచ్చారు. దానికి ఉదాహరణగా, మా వాషింగ్టన్ నుంచి 25 ఫామిలీలు యిక్కడికి వచ్చాయి. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవారే ఎక్కువమంది ఉన్నారు. చర్చలు కూడా ఉన్నాయి. వీటిలో కూడా అందరూ పాల్గొంటే, వాళ్లకున్నటువంటి అనుభవాలు కానీ, భవిష్యత్తులో ఉండే సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, మహిళల సమస్యలు కానీ, ఇంకెన్నో విషయాల గురించి చర్చించుకోవచ్చు. మా వాషింగ్టన్ నుంచే కాక ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ  కూడా సదుపాయాలు కల్పించి, ఇంత కష్టపడి చేసినందుకు న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ వారికీ, మిగతా వారికీ కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా, “ఆంధ్రులకు ఆరంభశూరత్వం” లాగ కాకుండ ప్రస్తుత సమ్మేళనానుభవాలు జయప్రదం అయితే, యిదే విధంగా పరిస్థితులను బట్టి ప్రతి రెండు మూడు సంవత్సరాలకి మనమంతా కలిసి, మన అనుభవాలన్నింటిని చర్చించుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మా వాషింగ్టన్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ, ముఖ్యంగా న్యూయార్క్ వారికి వందనాలు”.
కె. రామకృష్ణారెడ్డి, (ఫిలడెల్ఫియా)
ఈ ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనంలో పాల్గొనడం మా బాధ్యతగాను, గౌరవంగాను భావించి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా మా బాధ్యత అనుకోవడానికి కారణం, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువగా సహకరించగలరు అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా మొదటి నుంచి ఈ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మేళనం ఇలా జరగడం, దీన్నొక సుదినంగా మన హిస్టరీలోనే రాయచ్చు. హైదరాబాదులో రెండు సంవత్సరాల క్రిందట జరిగిన ఆంధ్ర మహాసభలతో సమానంగా జరగాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా విజయవంతం కావాలంటే మీ సహకారం చాలా అవసరం.
తరవాత మన ముఖ్యాంశాలేమిటి? ఎందుకని ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నాం అంటే - మన పిల్లలకు మన భాష మర్చిపోకుండా తెలుగు నేర్పాలి. మన భాషనీ, సంస్కృతినీ పోకుండా ఎలా మనం ఈ ఉత్తర అమెరికాలో నిలబెట్టాలా అనేది ముఖ్యంగా మన కోర్కె. ఉత్తర అమెరికాలో ఉన్న తెలుగువారిలో చాలామంది కళాకారులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరందరూ ఎక్కువగా సహాయంచేసి మనవాళ్ళందరికీ మన పద్ధతులు వచ్చేటట్లుగాను, ఈ అమెరికా పాశ్చాత్య సంస్కృతితో మనం మిశ్రమం కాకుండా మన ప్రజలకి ఒక ప్రత్యేక స్థానం ఉండాలని మన ప్రజల కోరిక.
మన పిల్లలకు ప్రాంతీయ భాషలలో స్కూల్స్ ప్రారంభించి, మన భాషల్ని, కళలని బోధించాలని నా అభిప్రాయం. తరవాత మన పిల్లలకి వేసవి తరగతులు ఏర్పాటు చేసి, మన ఆటలుగాని, కళలుగాని, సంగీతం గానీ నేర్పించాలని నా కోరిక. అందరి సహకారంతో ఒక వేసవి తరగతులు ఒక వారమో, రెండు వారాలో నిర్వహిస్తే బాగుంటుందని ఉంది. దీనిని చర్చించవచ్చు. కాబట్టి యీ సభలో మన భాషను, మన సంస్కృతిని  పోగొట్టకుండా వుంచాలని కోరుతున్నాను.
డాక్టర్ బి.ఎస్.రెడ్డి
“ఈ మహాసభ ఆహ్వాన సంఘం తరఫున మీకందరికీ ఆహ్వానం. ఆంధ్రదేశము నుండి, తదితర ప్రాంతాల నుండి చాలామంది ముఖ్యులు యీ సభకు వచ్చారు. ముఖ్యంగా, శ్రీమతి అనసూయ, సీత, డేవిడ్ కోర్ట్.నీ, శ్రీ మృత్యుంజయరావు, వారి శ్రీమతి, న్యూయార్క్ డెప్యూటీ కౌన్సిల్ జెనరల్ ఆఫ్ ఇండియా శ్రీ నంబిశన్, మద్రాస్ నుండి శ్రీ ప్రకాశరావుగార్లు ప్రేక్షకులలో ఉన్నారు. వీరికి, యింకా తరువాత రానున్న వారికి మన సమ్మేళనము తరఫున ధన్యవాదాలు.
ఎస్.వి.రామారావు, వేమూరి కృష్ణ, ఉమా దోనెపూడి, వారణాసి ప్రసాద్.ల  చిత్రాల ప్రదర్శన జరిగింది.
ముందుగా ఒక ప్రత్యేక సంచికను తెలుగులోను, ఇంగ్లీషులోను వెలువరించారు. అమెరికా తెలుగువారి రచనలు అందులో వెలికితెచ్చారు. సభా సందర్భంగా ఒక ప్రత్యేక స్టాంపును, కళా ప్రదర్శనను ఎస్వీరామారావు ఆధ్వర్యాన నిర్వహించారు.
మన సంస్కృతిని ఎలా వ్యాప్తి చేయాలనే విషయాన్ని డాక్టర్ అక్కరాజు శర్మగారు చక్కగా వివరించారు. “గృహిణి గా స్త్రీ” అనే విషయాన్నివిశదీకరిస్తూ కూచిభొట్ల జయ, టి. కృష్ణకుమారి, ఇందిర రాజన్, అక్కరాజు కామేశ్వరి, తిమ్మరాజు ఛాయ ఉపన్యసించారు.
వివిధ తెలుగు సంఘాలవారు నాటక సంగీత కళా ప్రదర్శనలకు తమ ప్రతినిధి వర్గాల్ని తీసుకొచ్చారు.
వాషింగ్టన్ పిల్లల బృందం వివిధ నాటికల్ని ప్రదర్శించారు.
హ్యూస్టన్ నుండి వచ్చిన తెలుగు సంఘం వారు జానపద, కూచిపూడి నృత్యాలు,  ఒక బుర్రకథను ప్రదర్శించారు. అందులో చిట్టెన్ రాజు వంతపాడటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేసిన,  సీత, అనసూయ, శ్రీ నరసింహమూర్తి, శ్రీ మూర్తి, శ్రీమతి రత్నపాపల జానపద గేయాలు ఆకట్టుకున్నాయి.
న్యూయార్క్ ప్రాంత కళాకారులలో బాలబాలికలు పాటలు, నాటకాలు, హరికథ, వీణకచేరి, సంగీతకచేరి వంటి  వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాకుండా కోలాటంలో కళాకారిణిలు పాల్గొన్నారు.
విచిత్ర వేషధారణలో అనేకమంది చిట్టి చిన్నారులు పిన్నలు పాల్గొన్నారు.  కాలానుగుణంగా వివిధ రకాల వస్త్రధారణతో న్యూయార్క్ ప్రాంత స్త్రీలు ప్రదర్శనలిచ్చారు.
మహాసభలో నగల అమ్మకానికి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని పెట్టారు.
సమావేశానంతరం జాతీయగీతం పాడారు.
అమెరికాలో ఉన్న తెలుగువారు ఒకేచోట సమావేశమవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించింది.  
శ్రీమతి భాస్కరమణి చారి, కె. రామకృష్ణారెడ్డి, రాజు సి. శివరామరెడ్డి, శాస్త్రి డి.వి., సుబ్బారావు కె., డా.గుత్తికొండ రవీంద్రనాథ్, మన్నే రమణారావు, తేళ్ళ తిరుపతయ్య, చలసాని విద్యాధర్ రావు, వెలువోలు బసవయ్య, వంగూరి చిట్టెన్ రాజు, పి.ఎస్.రావు సభ్యులుగా కమిటీ ఆఫ్ తెలుగు కాన్ఫరెన్స్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు అయింది.
1977 డిసెంబర్ లో డెట్రాయిట్ లో డా. మాధవరావు తుమ్మల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TELUGU ASSOCIATION OF NORTH AMERICA - TANA) అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వివిధ తెలుగు సంఘాలకు ఒక సమాఖ్యగా కూడా ఆ సంస్థను రూపొందించాలని నిర్ణయించారు. న్యూయార్క్ తొలి తెలుగు సభల అనంతరం రెండవ మహాసభ నాటికి తానా నామకరణం స్థిరపడింది.
డెట్రాయిట్.లో జరిగిన తాత్కాలిక కమిటీ సమావేశంలో డా. కాకర్ల సుబ్బారావు అధ్యక్షుడుగా, డా. తుమ్మల  మాధవరావు కార్యదర్శిగా, డా. ముక్కామల అప్పారావు కోశాధికారిగా తానా మొదటి కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేశారు. తానా బైలాస్ ముసాయిదాను తయారు చేసేందుకు డా. జాస్తి వెంకటేశ్వర్లు, రామినేని అచ్యుతరావు తదితరులతో ఒక సబ్ కమిటీని ఏర్పరచారు. బైలాస్ ముసాయిదా ప్రతిని చర్చించేందుకు వాషింగ్టన్ డి.సి.లో మరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే తానా సంస్థను నమోదు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక మధురానుభూతిగా మిగలడానికి న్యూయార్క్ సమావేశాల ఘట్టాలను తొలి తెలుగు సమావేశాలుగా పరిగణించారు.
ప్రథమ మహాసభ ప్రత్యేక సంచిక
న్యూయార్క్ లో తొలి తానా మహాసభ జరిగినప్పుడు పాల్గొన్న తెలుగు వారి సంఖ్య పరిమితంగా ఉన్నా అత్యంత ఉత్సాహభరితంగా కార్యక్రమాలు జరపటం విశేషం. ఆ సభల ప్రత్యేకతను చాటేరీతిలో తొలి ప్రత్యేక సంచిక వెలువరించారు. భారత అమెరికా సంస్కృతి, స్నేహబంధాల అన్యోన్యతను కనబరిచేటట్లు సంచికను రూపొందించారు. కాకతీయ సంస్కృతీ సంప్రదాయాలని ప్రజ్వలింపచేస్తూ వరంగల్లుకోట ముఖద్వారం, దాని మధ్యలో ఉన్న కలశం తెలుగు జాతి గౌరవాన్ని, సంప్రదాయాన్ని విశ్వజనీనం చేస్తోంది. నాలుగు వైపుల ఉన్న పువ్వుల వరుస అమరావతీ స్తూపాల చిత్రకళని గుర్తుచేస్తున్నాయి. అడుగున తెలుగులో ఉన్న ప్రత్యేకమైన వాక్యాలు తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగుజాతికి అభివృద్ధికి కృషి చేసిన వారి కీర్తి ప్రతిష్ఠలని ఇనుమడింప చేస్తున్నాయి.
ఆర్ట్ ఎగ్జిబిషన్ ఛైర్మన్ (లూయీవిల్, కెంటకీ), ప్రముఖ చిత్రకారుడు శ్రీ ఎస్.వి. రామారావు ముఖచిత్రాన్ని చిత్రించారు, సంచికను కృష్ణంరాజు ఆవిష్కరించారు.
సంచికలో విశేషాలు :  ఆంధ్రుల చరితం, పతివ్రతలు, హంసగానం, మనుషులు మారాలి, పండుగ ముచ్చట, ఈ జీవితానికి ఇదే చాలు, అమెరికా తెలుగువాడ, అంజలి,  అమ్మవారి సంబరాలు, మాతృహృదయం, మేము, మా బామ్మ, అమెరికాలో భారతీయులు – మన సంస్కృతి, సుప్రభాతము, రసజ్ఞుడి ఆవేదన, నిష్కృతి, బాల సందేశం, భగీరథ ప్రయత్నం, అనుకోని టెలిఫోన్ కాల్, నా దేశంలో, ఆకలియాత్ర, ఏమిటో ఈ మాయ, దయ్యం పట్టింది, నీరాజనములు, బ్రతుకలేక చస్తున్నాను, కృష్ణగారి బొమ్మ, చెంపకు చారెడు కళ్లు, మార్పు, బరువు తగ్గాలంటే, గళ్ల మడికట్టు, అన్వేషణ, గళ్ళ నుడికట్టు, ఎడ్మంటన్ తెలుగు సంఘం, టోరంటో తెలుగువారు, హ్యూస్టన్ సమితి, ఏనుగుల ముగ్గు, ఎవరికోసమో, వంటి తెలుగు కథలు, వ్యాసాలు .