2, ఫిబ్రవరి 2012, గురువారం

మా వూరు తాడేపల్లిగూడెం

నేను చిన్నప్పటి నుంచీ పెరిగిన వూరు తాడేపల్లిగూడెం. నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి అనుభూతులు చాలా వున్నాయ్. నేనూ మా వారూ ఈ మధ్య తాడేపల్లి గూడెం వెళ్ళాం. మా వారికి అన్నీ చూపించాను. మా వూర్లో తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం. ఇంచుమించు 22 సంవత్సరాల తర్వాత వెళ్ళాను. వాళ్ళ పలకరింపులు, ఆప్యాయతలు ఆనందాన్నిచ్చాయి. మేము చదివిన డి.ఆర్.గోయంకా కాలేజీలో అడుగుపెడుతుంటే చాలా ఒకలాంటి పులకరింత వచ్చింది. నేను మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడ తిరిగామో తలుచుకున్నాను. మా వెక్కిరింతలు, దెబ్బలాటలు, కలుసుకోవడాలూ అన్నీ గుర్తువచ్చాయి.
మేము చిన్నప్పుడు మొదటగా ఉండే వీధి అయితే అలాగే వుంది. అక్కడ అడుగు పెట్టగానే కలిగిన అనుభూతి చెప్పలేను. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాను. నేను చిన్నప్పుడు మా అమ్మకి తెల్లవారుఝామున తొలిమంచు వేళలో 5 గంటలకి అందరి ఇళ్లకి వెళ్లి విడిచీ విడవని పువ్వులు దేవుడికోసం తీసుకువచ్చేదాన్ని. ఇంచుమించు 10-12 రకాల పువ్వులుండేవి. ఆ అందాలు చూడాల్సిందే. చెబితే తెలీదు. అక్కడ నీళ్ళమధ్యలో కృష్ణుడు బొమ్మ ఉన్న చెరువు వుండేది. అప్పట్లో అది కొత్తగా తవ్వారు. చుట్టూ చెట్లతో చాలా బావుండేద. అక్కడికి విహారానికి వెళ్ళి, చెరువు చుట్టూ తిరుగుతూ పాటలు పాడేవాళ్ళం. ఇంకా చాలా అనుభూతులున్నాయ్. మళ్ళీ పంచుకుంటా.